Telangana | హైదరాబాద్/జగిత్యాల, నవంబర్ 10, (నమస్తే తెలంగాణ)/రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో సంప్రదాయ కుల వృత్తిదారులు, సంచార జాతుల కాలాన్నే ప్రభుత్వం ఎగరగొట్టింది. వారు ఉన్నారన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రభుత్వ వైఖరిపై ఎందరో సంచార, సంప్రదాయ వృత్తిదారులు మండిపడుతున్నారు. సర్వే ఫారం లో తమ కులవృత్తుల వివరాలు లేకుండా చేసి, తమను అవమానపర్చడమే గాక, భవిష్యత్తులో తమ కులవృత్తులను పూర్తిగా లేకుం డా చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నదంటూ ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సంప్రదాయ కులవృత్తుల వివరాలు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలు నమోదు చేయకుండానే కులగణన ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. కులవృత్తిదారుల వివరాలు సేకరించకపోవడం విస్మయానికి గురి చేస్తుందంటున్నారు.
విశ్వబ్రాహ్మణ కులంలోని కంచరి (ఇత్తడి బిందెలు, సామగ్రి తయారీదారులు), శిల్పి (రాతి విగ్రహాల తయారీదారులు) కులవృత్తుల వారికి సంబంధించిన వివరాలు లేనేలేవు. ఎస్సీ కులాలకు సంబంధించి, సంచార జీవితం గడుపుతూ సవరాలు నేసే బేడ బుడిగ జంగాల కులవృత్తి వివరాలు మాయమయ్యాయి. ఇప్పటికీ ఎల్లమ్మ పటాలతో అడుక్కునే వారి వివరాలు అసలే లేవు. మాల జంగం, మిత్తిలి అయ్యవార్లు, పాకి, తోటి, చిందు వృత్తుల గురించి సర్వేలో అసలు ప్రస్తావించనే లేదు.
బీసీ వర్గాల్లోని బుడబుక్కల, దాసరి (దాసరి అయ్యగార్లు, భిక్షాటన చేసే వృత్తి) గంగిరెడ్లవారు, జంగం, కాటికాపరులు, పంబాల, పెద్దమ్మలవారు, ఒడ్డెర కులస్తులు, పద్మశాలీ ఆశ్రిత కులంగా ఉండి మార్కండేయ పటం వేసి కథ చెప్పడంతోపాటు, ప్యాలాల ముద్దలు, బత్తీసలు, చెక్కర బిల్లలు చేసి విక్రయించే కూనపులి వృత్తిదారుల వివరాలు నమోదు చేయలేని పరిస్థితి నెలకొన్నది.
బుక్క అయ్యవారి కులవృత్తి వివరాలు కులగణన పుస్తకంలో పేర్కొనలేదు. పూసల కులస్తులు, గౌడషెట్టి వృత్తిదారుల పేర్లు నమోదు చేయలేని స్థితి ఉత్పన్నమైంది. నిర్మల్, జగిత్యాల, మెట్పల్లి, మహబూబ్‌నగర్ లాంటి చాలా జిల్లాల్లో ఉన్న నకాషీ కళాకారుల వివరాలు పేర్కొనలేదు. మైనార్టీ వర్గాలకు అనుబంధంగా ఉన్న దూదేకుల, గాండ్ల, ఆరె కటిక వృత్తిదారుల వివరాలూ లేకుండాపోయాయి.
సంప్రదాయ కులవృత్తిని ఎంచుకొని దాని ద్వారానే ఉపాధి పొందుతున్న వారి వివరాల నమోదుకు అవకాశం లేకుండా పోవడంతో ఆయా కులాలకు చెందిన వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సర్వే ఫామ్‌లో తమ వృత్తి కాలం ఎందుకు లేదని, దానిపై ఆధారపడి బతుకుతున్న తమ ఆర్థిక, ఉపాధిని ప్రభుత్వం ఎలా లెక్కిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. సర్వే కాలంలో బ్రాహ్మణుల వృత్తి ప్రస్తావనతోపాటు, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో వ్యవసాయాన్ని చేపట్టిన మున్నూరుకాపుల వృత్తి వివరాలు సైతం లేకపోవడం గమనార్హం.
ఇంటింటిసర్వే ఫారంలో హైకోర్టు ఆదేశాలతో నో క్యాస్ట్, నో రిలీజియన్ కాలమ్ చేర్చ గా, అవిగాకుండా మరో 2 ప్రశ్నలను ప్రభు త్వం జాబితాలో ఇటీవలే చేర్చింది. 55వ ప్ర శ్నగా కుటుంబంలో ఎవరైనా కులాంతర వివా హం చేసుకున్నారా? 56వ ప్రశ్నగా మీ కుటుంబంలోని సభ్యులు ఎలాంటి బెదిరింపులు, వివక్ష లేకుండా స్థానిక దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, ప్రార్థనాలయాలకు వెళ్తున్నారా? అని పొందుపరిచింది. సర్వే పారం లో కాలం నంబర్ 45లో సంచార జాతికుల మా? అనే ప్రశ్నను తాజాగా సర్వే ఫారమ్ నుంచి తొలిగించడం వివాదాస్పదంగా మా రింది. శనివారం ముందు వరకూ 45లో సంచార జాతికి చెందిన వారా? అనే ప్రశ్న ఉన్నది.శనివారం మాత్రం ఆ ప్రశ్నను తొలగించారు. సంచారజాతి కులాల వివరాలను ప్రభుత్వం సేకరించాలని భావించడం లేదా? అని అనుమానం కలుగుతున్నది.
రాష్ట్రంలో మొత్తంగా 52 సంచారజాతి కులాలు ఉన్నాయి. అందులో ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) క్యాటగిరీలో 35 కులాలు ఉన్నాయి. అవి బాలసంతు, బహురూపి, బుడబుకల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవాళ్లు, జంగంజోగి, మొండివాళ్లు, మొండిపట్ట, మొండిబండ వంశరాజ్, పాముల, పార్థి, నకల పంబాల, పెద్దమ్మల్లోళ్లు, వీరభద్రయ, గుడాల, కంజెరబట్ట, రెడ్డిక, నేకార్, పరికిముగ్గుల, యాట, చోపేమారి, కైకడి, జోషినందివాళ, మందుల, కూనపులి, పట్ర, పాలఏకరి, రాజన్నల, గోత్రాల, బుక అయ్యవారు, కశికాపాడి, సిద్ధుల వృత్తులు ఉన్నాయి. 2020లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ (ఏ)లో 13 సంచారజాతి కులాలను చేర్చింది. వారిలో పఠంవారు, ఆద్దమువారు, బాగోతుల, బైలిప్మామ్మరి, ఏనుటి, గంజికూటివారు, గౌడజెట్టి, కాకిపడగల, మాసయ్యలు, ఓడ్, శ్రీశత్రియ రామజోగి, తేరాచీరాల, తోలుబొమ్మలాటవారు ఉన్నాయి.
ఇవిగాకుండా ప్రత్యేక ఫెడరేషన్ల కింద సంచారజాతి కులాలు 4 ఉన్నాయి. అవి వడ్డెర, పూసల, మేదరి, బోయ. అదేవిధంగా బీసీ (ఈ) గ్రూప్‌లో ఉన్న ముస్లిం కులాలు అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు అత్తరు సాయిబులు, అత్తరోళ్లు దోభీ ముస్లిం, ముస్లిం రజకులు ఫకీరు, ఫకీరు బుడ్ బుడి, గంటా ఫకీర్లు, దర్వేష్ ఫకీర్, గారడీ సాయిబులు, పాముల వాళ్లు, కనికట్టు వాళ్లు, గోసంగి ముస్లిం, పకీరుసాయిబులు ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్రాల వాళ్లు, హజమ్, నాయీ ముస్లిం, నవీద్ లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతే వాలే, ఖురేషీ, కసబ్, మరాఠి కసబ్, ముస్లిం కటిక. షైక్, షేక్ సిద్ధి, యాబ, హబ్షి, జసి తురక కాశ, జింక సాయిబులు, చకిటకానెవాలె (రోళ్లకు కక్కు కొట్టేవారు), పట్టర్ పోడులు ఇలా మొత్తంగా బీసీ ఏ గ్రూప్‌లో 52 సంచారజాతి కులాలు ఉన్నాయి. బీసీ (ఈ) గ్రూప్‌లో 14 సంచార ముస్లిం కులాలు ఉన్నాయి. సర్వే పారంలోని కాలం నంబర్ 45 ద్వారా వీరి లెక్క తెలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలను ఫారం నుంచి తొలిగించడం గమనార్హం.
కులగణన సర్వేలో శిల్పి(కాశె) కులాన్ని తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ వేశాం. విశ్వబ్రాహ్మణ కులాల్లో ఒకటిగా ఉన్న మా కులాన్ని ఎలా తొలగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సోయి ఉండి చేస్తున్నదా? లేక చేస్తున్నదా?. కుట్రపూరితంగా విశ్వబ్రాహ్మణులను అణగదొక్కే దురాలోచనగా తెలుస్తున్నది. శిల్ప, కంచరి కులాలను తొగించడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం ఖండిస్తున్నది. అసమగ్ర సర్వేను వెంటనే ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం.
– హరిహరాచారి, శిల్పాచార్యుడు, రామడుగు, కరీంనగర్
నేను నా చిన్నతనం నుంచే ఇత్తడి, రాగితో ఇళ్లు, ఆలయా ల్లో ఉపయోగించే వస్తువులను తయారు చేస్తు న్నాం. విగ్రహాలు, జ్యోతు లు, బిందెలు, చెంబులు, బ కెట్లు, ఇతర వస్తువులను తయారు చేసేవాడిని. సర్కారు మా కులమే లేదని చెప్తే ఏంచేయాలి. భవిష్యత్తులో మా వారసులు ఎలా బతకాలి.
– రావుల రామస్వామి, కరీంనగర్
సర్వే ఫారం నుంచి 45వ కాలమ్‌ను తొలగించి సంచార జాతి కులాల ఉనికిని ప్రభుత్వం కనుమరుగు చేస్తున్నది. కాలమ్‌ను తొలగించడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి? సంచార జాతుల కులాల లెక్కలను ఎలా తీస్తారు? మొత్తంగా కుల సర్వేకే అర్థం లేకుండాపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలి. కాలమ్‌ను యథావిధిగా పునరుద్ధరించాలి. సంచారజాతుల కులాల లెక్కలను తీయాలి.
– తిపిరిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం