KTR | కేసీఆర్ హయాంలో సంక్షేమంలో స్వర్ణయుగంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రతి యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటం చేశారని అన్నారు. తెలంగాణ విద్యార్థుల పోరాట ప్రతిమను దేశం గుర్తించిందని తెలిపారు. తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాలు కదం తొక్కాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో మోదీ సర్కార్ మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని కేటీఆర్ అన్నారు. ఎవరి కోసం ఎదురుచూడకుండా అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తిరుగులేకుండా పోయిందని చెప్పారు. అప్పుడు తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కార్ సహకరించలేదని తెలిపారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని కేసీఆర్ ఎదురుచూడలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 12వ స్థానంలో ఉన్న తెలంగాణను వ్యవసాయంలో అగ్రగామిగా నిలబెట్టామని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలో హిమాలయాలంత ఎత్తుకు తెలంగాణను కేసీఆర్ తీసుకెళ్లారని పేర్కొన్నారు. నాలుగేళ్లలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించామని చెప్పారు. కాళేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా ఏర్పాటు చేశామని వివరించారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కో ప్రాజెక్టు 40 ఏళ్లు కట్టారని తెలిపారు. కానీ ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడ్డారు. 80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని.. అసెంబ్లీలో నిలదీయడంతో కాంగ్రెస్, బీజేపీ మాట మార్చాయని తెలిపారు.
ఎవర్ని ఉరితీయాలి
మేడిగడ్డ బరాజ్‌పై కూడా కాంగ్రెస్ వాళ్లు కుట్రలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ అంటే.. దుడ్డెను కట్టేయమన్నట్లు బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎక్స్పాన్షన్ జాయింట్ల దగ్గర వెడల్పయితే కూలిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌లోని 85 పిల్లర్లలో రెండు కొంచెం కుంగితే కూలిందని ప్రచారం చేశారని విమర్శించారు. శతాబ్దాలుగా ఎప్పుడు రానంత వరద వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదని గుర్తుచేశారు. కానీ కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడతారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కట్టినోళ్లను ఉరితీయాలని అంటున్నారని మండిపడ్డారు. మీలెక్క 40 ఏళ్ల కట్టనందుకు ఉరితీయాలా అని ప్రశ్నించారు. మీలెక్క రైతులకు నీళ్లు ఇవ్వనందుకు ఉరితీయాలా అని నిలదీశారు. ఫ్లోరోసిస్ వ్యాధితో నల్గొండలో పిల్లలు పుట్టకుండా చంపేసినందుకు కాంగ్రెస్ వాళ్లను ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు కాంగ్రెస్ నేతల్ని ఉరితీయాలని అన్నారు.
కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి
రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చారని మండిపడ్డారు. అన్నీ తెలిసే అధికారం కోసం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నాడని గుర్తుచేశారు. 25 లక్షల కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని నమ్మబలికారని అన్నారు. చివరకు అన్ని హామీలు ఎగ్గొట్టి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.