విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి ఆవులు, గేదెలకు పశుగ్రాసం కొనలేక అప్పుల పాలవుతున్నామన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు విజేందర్‌రెడ్డి, రంగయ్య, యాకుబా, శేఖర్, దేవేందర్, నిరంజన్, ప్రసాద్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– వెల్దండ
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు గురువారం రోడ్డెక్కారు. పాఠశాల నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. 850మంది విద్యార్థులున్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులతో చదువులెట్ల సాగించాలని మండిపడ్డారు. ఇన్చార్జి డీఈవో ఉదయబాబు, డీఎస్పీ కరుణాకర్, సీఐ సతీశ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు శాంతించలేదు. చివరికి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే స్పందించి పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే వారినే నియమిస్తామని, లేదంటే తాతాలిక ఉపాధ్యాయులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాకు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి మద్దతు తెలిపారు.
– ఆసిఫాబాద్ టౌన్
సింగరేణికి 2023-24లో వచ్చిన లాభాలను ప్రకటించి 35శాతం వాటాను నెలాఖరు వరకు కార్మికులకు చెల్లించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూడు డివిజన్లలో గురువారం ఆందోళనలు చేశారు. సింగరేణిలో ఎప్పుడూ లేనివిధంగా 70మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగిందని, ఆర్థిక సంవత్సరం గడిచి ఆరు నెలలు దాటినా వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. అనంతరం జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు.
– గోదావరిఖని
మూడు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. ఇట్లయితే ఎట్ల బతికేది.. కుటుంబాన్ని ఎట్ల సాకేదని ఆవేదనకు గురైన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సెల్ టవర్ ఎక్కాడు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం ఇస్సానగర్‌లో వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జీపీ కార్మికుడు కొమ్ము రాజు గురువారం టవర్ ఎక్కాడు. రెండు గంటలకుపైగా అక్కడే ఉన్నాడు. తోటి కార్మికులు, గ్రామస్తులు నచ్చజెప్పడంతో కిందకు దిగొచ్చాడు. వారం, పదిరోజుల్లో జీతాలు చెల్లిస్తామని ఎంపీవో కృష్ణ తెలిపారు.
– బీబీపేట్
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ పారితోషికంలేని పనులు చేయించడంతో ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, పని ఒత్తిడితో మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. పల్స్ పోలియో, లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
– మహబూబాబాద్ రూరల్
భారీ వర్షాలు, వరదతో సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం వెంటనే ఆర్థికసాయం అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన పలువురు బాధితులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. 20రోజులు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థికసాయం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు
మొరపెట్టుకున్నారు.
– మహబూబాబాద్
ఆదిలాబాద్ జిల్లా రామాయిలో ఏర్పాటు చేసే సిమెంటు పరిశ్రమకు తమ భూములు ఇవ్వబోమంటూ నిర్వాసిత రైతులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎకరానికి రూ.35లక్షల నుంచి రూ.40లక్షలు పలికే భూములను రూ.8.50లక్షలకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు.
– ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ)
‘ఇదేం పాలన. వీళ్లేం అధికారులు, మూడు నెలలుగా మంచినీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా..?’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీని ముట్టడించారు. ఎస్సీ కాలనీలో నీటి సరఫరా చేయడం లేదని, వ్యవసాయ బోరుమోటర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. జీపీ కార్యదర్శి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
– సిరిసిల్ల రూరల్
జీవనభృతి రూ.4,016కు పెంచాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని బీడీ కార్మికులు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. బీడీ కార్మికుల పింఛన్లు రూ.4016 కు పెంచుతాని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ మాలతికి వినతిపత్రం సమర్పించారు.
– ధర్పల్లి
ఆసరా పింఛన్ అందించాలంటూ జనగామ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన వితంతు, ఒంటరి మహిళలు గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి కార్యాలయంలోకి ఉద్యోగులను పోనివ్వకుండా అడ్డుకున్నారు. తమ అర్జీలను చెత్తబుట్టలో పారేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ మంజూరు చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.
– జనగామ (నమస్తే తెలంగాణ)