హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Local Body Elections) నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం తన కార్యాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత షెడ్యూల్లో ప్రకటించినట్టుగా మూడు దఫాల్లో ఎన్నికలను నిర్వహిస్తారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20-25 తేదీల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాణికుముదిని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎస్ఈసీ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, పీఆర్ఆర్డీ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ సృజన, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా తప్పులు లేకుండా ఓటర్లు జాబితా రూపొందించడం, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై రాణికుముదిని పలు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్‌కు పోలింగ్‌కు మధ్య వ్యవధి గరిష్ఠంగా ఐదు రోజులు ఉండాలి. అయితే, రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహిద్దామా? మూడు దఫాల్లోనా? అనే అంశం సమీక్షలో చర్చకు వచ్చినప్పుడు ఎక్కువమంది అధికారులు మూడు దఫాలకు మొగ్గుచూపడంతో మూడు రోజుల గ్యాప్‌తో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే అభిప్రాయానికి ఎస్ఈసీ వచ్చినట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌కు నిర్ణయించినట్టు సమాచారం.
వచ్చేవారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు అనుగుణంగా ఎస్ఈసీ ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు ఎస్ఈసీ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. గురువారం నుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ, వార్డుల మ్యాపింగ్‌లో తప్పుల సవరణ చేపట్టనున్నారు. ఓటర్ల నుంచి అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను 22న జిల్లా పంచాయతీ అధికారులు పరిష్కరించనున్నారు. 23వ తేదీన తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలవారీగా ప్రచురిస్తారు.
ఒకవేళ డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరిగే ప్రజా పాలన వారోత్సవాలకు ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తే ప్రభుత్వం షెడ్యూల్‌ను కూడా మార్చే అవకాశం లేకపోలేదని కూడా అధికారులు చెప్తున్నారు. కొందరు నేతలు డిసెంబర్ 9 తర్వాత ఈ ఎన్నికల నిర్వహించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 3వేల కోట్లు విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఎన్నికలను 3దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషనర్ కుముదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను నిర్వహించగా, ఇందుకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి మించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జీవోలు వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ఇచ్చిన జీవో 9, అలాగే 41, 42 జీవోలు కూడా సూపర్సీడ్ అవుతాయి. అయితే, 2019లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.3 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9.8 శాతం రిజర్వేషన్లు పాటించారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారా? లేక, పెరిగిన బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతారా? అనేది తేలాల్సి ఉంది. అలాగే, గతంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించగా కోర్టు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ అంశంపై స్పష్టత కరువైంది. గతంలో ఖరారు చేసిన రిజర్వేషన్ స్థానాలను కొనసాగిస్తారా? లేదంటే మార్పు చేర్పులు ఉంటాయా అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. అయితే, శుక్రవారం జీవోలు ఇచ్చిన అనంతరం రెండు రోజుల్లో అధికారులు పంచాయతీలవారీగా, జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారని సమాచారం. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోపు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని హైకోర్టుకు తప్పనిసరిగా చెప్పాల్సి ఉన్నందున అప్పటిలోగా అన్నీ సిద్ధంచేయాలని అధికారులు భావిస్తున్నారు. 25 లేదా 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు.