GHMC | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ గెజిట్‌పై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డులోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులోభాగంగా ముందుగా.. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన గ్రామ పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జనవరిలో ముగియనుంది. అప్పటివరకు ఆ పాలకవర్గాలను కొనసాగించి ఆ తరువాత ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామాలను మొదటిదశలో సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియపై ఆగస్టు ఒకటిన ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ఈ కమిటీలో మం త్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 22న సమావేశమై ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీల మాజీ ప్రజాప్రతినిధులు, చట్ట సభల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సమావేశంలో ఔటర్‌కు అవతల ఉన్న ఆరు గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని నిర్ణయించారు.