CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేస్తానని, ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ తనదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ‘గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగదు. గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేసే బాధ్యత మాది. ఏం చింతించకండి.. మీ (బీఆర్ఎస్) ఒక్క ఆనవాలు కూడా కనిపించదు. మీ ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ నాది’ అని అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. సభలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం సభా గౌరవానికి మంచిదికాదని, భవిష్యత్తులోనైనా సభకు వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. తనను ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కలిసి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. ‘రండి మన రాష్ర్టాన్ని పునర్నిర్మించుకుందాం’ అని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
చిహ్నాలు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు
ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజా పాలనలో భాగంగానే తెలంగాణ చిహ్నాల్లో మార్పు తెస్తున్నట్టు సీఎం తెలిపారు. తెలంగాణను టీఎస్‌గా కాకుండా టీజీగా ఉండాలని ప్రజలు కోరున్నారని, అందుకే టీఎస్‌ను టీజీగా మార్చుతున్నామని చెప్పారు. ‘తెలంగాణ తల్లి రూపం తెలంగాణ వనితలకు ప్రతిరూపంగా లేదు. తెలంగాణ ఆడబిడ్డలు వజ్ర వైడూర్యాలు, కిరీటాలు పెట్టుకోలేదు. అందుకే తెలంగాణ వీరవనితల దర్పం, శ్రమకు ప్రతీకగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నం. తెలంగాణ చిహ్నంలో చార్మినార్, కాకతీయ గుర్తులున్నాయి. అవి రాచరిక పోకడలను ప్రదర్శిస్తున్నాయి. వెట్టి చాకిరి, రాచరికపు ఆనవాళ్లు లేకుండా చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. చిహ్నాల మార్పు అంశంలో మా ప్రభుత్వ ఆలోచన తప్పైతే చెప్పండి’ అని ఎమ్మెల్యేలను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వృద్ధులకు, ఇతర పెన్షన్లను కూడా ఒకటో తేదీనే ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నెలలో ఇప్పటివరకు 80 శాతం పెన్షన్లు అందించామని, మరో 20 శాతం పెండింగ్‌లో ఉన్నాయని, 15వ తేదీలోపు మొత్తం పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుబంధును ఆలస్యంగా వేసేదని ఆరోపించారు. 2018-19 నుంచి ఈ ఏడాది యాసంగి సీజన్ వరకు ప్రతిసారి ఆలస్యంగానే వేసిందని విమర్శించారు. శాసనసభ్యులు ఏ పార్టీకి చెందినవారైనా వారి వినతులను ప్రభుత్వం వింటుందని హామీ ఇచ్చారు.
ఉచిత బస్తో పెరిగిన ఆదాయం
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడంపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఆటోవాళ్లకు ఆదాయం పోయిందంటూ అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల దేవాలయాలకు భారీగా ఆదాయం పెరిగిందని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకానికి ముందు నవంబర్‌లో దేవాలయాల ఆదాయం రూ.49.28 కోట్లు ఉండగా, పథకం అమలు తర్వాత డిసెంబర్లో రూ. 93.24 కోట్లకు పెరిగిందని తెలిపారు. జనవరిలో రూ.68.69 కోట్లు వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే ఈ పథకం కోసం రూ. 530.52 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
జస్ట్ లైక్ దట్.. అలా ఉద్యోగాలు భర్తీ చేయలేం
ప్రతిపక్షాలు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నాయని, కానీ ఉద్యోగాల భర్తీ కోసం ఓ పద్ధతి ఉంటుందని సీఎం తెలిపారు. జస్ట్ లైక్ దట్.. అలా చేయలేమని తేల్చేశారు. సరైన విధానం కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 15 రోజుల్లో 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకం చేపడతామని వెల్లడించారు. ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 46 ఏండ్లకు పెంచుతామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయకపోతే తామే నర్సు పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు.
విభజన చట్టంలోనే ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయం
2014లో ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు నిర్ణయం జరిగిందని సీఎం తెలిపారు. చట్టంలో లోపం ఆనాటి ప్రభుత్వాలది కాదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నా చేస్తామనడంపై స్పందిస్తూ.. ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. తాము ఇప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ తమతో కలిసి రావాలని, కలిసి కొట్లాడుదామని విజ్ఞప్తి చేశారు. 12వ తేదీన ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్టు తెలిపారు. 3వ తేదీన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీ నుంచి ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తామని చెప్పారు.
మెట్రోపై కేంద్రానికి ప్రతిపాదన
రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇందుకోసం ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఇటీవల వెల్లడించిన ప్రకారం మెట్రో రూట్లలో మార్పులు చేసినట్టు వివరించారు. 56 కిలోమీటర్ల పొడవున మూసీని నదిని సుందరీకరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లా కోసం కొత్త కలెక్టరేట్‌ను నిర్మిస్తామని ప్రకటించారు.