Telangana Not For Sale | తెలంగాణలో బీజేపీ ఎత్తులు పారలేదు. కాషాయ పార్టీ చేసిన ప్రలోభాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. వంద కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ఆశచూపినా లొంగలేదు. కోట్ల రూపాయల కంటే తెలంగాణ ఆత్మ గౌరవమే ముఖ్యమని అనుకున్నారు. కేసీఆరే తమకు దేవుడని.. గుజరాతీల కింద గులాంలుగా బతకడం ఇష్టం లేక కోట్ల రూపాయలను వద్దనుకున్నారు. బీజేపీ తమను కొనేందుకు బేరసారాలు జరుపుతుందని స్వయంగా ఆ ఎమ్మెల్యేలే బయటపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని.. ఇక్కడి నేతలను, ప్రజలను కొనలేరని అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది.
మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి దొరికిపోయింది. మొయినాబాద్‌కు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు పట్టుబడ్డారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఉన్నారు. వీరి దగ్గర నుంచి రూ.15 కోట్ల నగదును సీజ్ చేశారు.