హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): దక్కనీ, కాకతీయ శైలిలో అన్ని హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకొంటున్న నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేసి దసరా నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేయనున్నారు. 150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వర్క్‌స్టేషన్ ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. మూడు షిప్ట్‌లలో కలిపి దాదాపు 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు.
సచివాలయ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతో అన్ని విభాగాల పనులను సమాంతరంగా చేపడుతున్నారు. విద్యుదీకరణ, ప్లంబింగ్, ఇంటీరియర్ డిజైన్ పనులన్నీ ఏకకాలంలో చేస్తున్నారు. రెడ్‌శాండ్ స్టోన్ ఫిక్సింగ్ పనులు, గుడి, మసీదు, చర్చి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజిటర్స్ వెయిటింగ్ రూమ్, సెక్యూరిటీ సిబ్బంది కాంప్లెక్స్ తదితర పనులన్నీ సమాంతరంగా చేపడుతున్నారు. అలాగే సచివాలయంపైన నిర్మించే డోమ్స్ ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 34 డోమ్స్కు ఇప్పటి వరకు 7 మినహా అన్నింటినీ ఏర్పాటు చేశారు.
సచివాలయం తెలంగాణకు ఐకానిక్‌గా ఉండాలని, 33 జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికారులు, నిర్మాణ సంస్థను ఆదేశించారు. వరుసగా సమీక్షలు నిర్వహించారు. అవసరమైన సలహాలు ఇచ్చారు. టెండర్ దక్కించుకొన్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిత్యం సమీక్షలు చేస్తూ, ఆకస్మిక తనిఖీలు చేస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా 3 షిప్ట్‌లలో 2 వేల మంది కార్మికులతో సచివాలయ నిర్మాణ పనులు చేస్తున్నాం. 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు చేస్తున్నాం. సచివాలయ ప్రధాన భవనానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేలా 16 అడుగుల ఎత్తు కాంక్రీట్ గోడ నిర్మించాం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నాం. దసరా నాటికి పూర్తి చేయాలన్న టార్గెట్‌తో పని చేస్తున్నాం.
– గణపతిరెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్, రోడ్లు భవనాలశాఖ