పడమరన కన్నడిగులు.. కేసీఆర్ అవరన్ను ప్రధానియాగి నోడబేకిదె
ఉత్తరాన మరాఠాలు.. కేసీఆర్ యాన పంత్‌ప్రధాన్ హ్వావే ఆహేత్
తూర్పున ఆంధ్రులు.. కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలని ఉన్నది
భాషలు వేరైనా.. భావం ఒక్కటే
ప్రాంతాలు వేరైనా.. స్వరం ఒక్కటే
అందరి ఆకాంక్ష.. కేసీఆర్ ప్రధాని కావాలి!
కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయం జరుగుతుంది’ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కండ్లారా చూస్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు అంటున్న మాటలివి. అందుకే తమనూ తెలంగాణలో కలపాలని ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు.. స్వయంగా సీఎం కేసీఆరే దేశ రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించగానే కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు.
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: కేసీఆర్ యాన పంత్ ప్రధాన్ హ్వావే ఆహేత్.. తెలంగాణకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట. దానర్థం.. ‘కేసీఆర్ ప్రధాని కావాలి’ అని. తెలంగాణలోని పథకాలను చూసి తమనూ ఆ రాష్ట్రంలో కలపాలని నాలుగేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దానికోసం గ్రామాల్లో తీర్మానాలు కూడా చేశారు. అది వీలుకాకపోతే, కేసీఆర్ ప్రధాని కావాలి, తమ దగ్గరా ఆ పథకాలు పెట్టాలని బలంగా కోరుకొంటున్నారు. మహారాష్ట్రలోనే కాదు.. తెలంగాణకు ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా తమను కేసీఆర్ పాలనలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలుకా, నాందేడ్ జిల్లాలోని భోకర్ తాలుకా, యావత్మాళ్ జిల్లాలోని ఝరిజామని తాలుకా, చంద్రపూర్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలు, కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయచూర్ జిల్లాలకు చెందిన సరిహద్దు గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అది వీలుకాకపోవటంతో ఇన్ని రోజులు నిట్టూర్చిన ఆ ప్రజలు సీఎం కేసీఆర్ ప్రకటనతో కొత్త జోష్‌లో ఉన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ వద్ద అమలు కావటం లేదని, అలా కావాలంటే.. కేసీఆర్ ప్రధాని కావాలని అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా, వితంతు పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, భూ రికార్డుల ప్రక్షాళన, కల్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు సహా, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వస్తున్న అంతర్జాతీయ కంపెనీలు, పెరిగిన ఉపాధి ఉద్యోగావకాశాలు, భారీగా పెరిగిన భూములు, ఇండ్ల ధరలు అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ‘కేసీఆర్ ప్రధాని కావాలి, మాకూ తెలంగాణ పథకాలు రావాలి’ అని దేశ ప్రజలు నినదిస్తున్నారు.
తెలంగాణలో కలపడం అసాధ్యమే.. కానీ..
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన సరిహద్దు గ్రామాల ప్రజలు తమను కూడా ఆ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ‘మా రాష్ర్టాల్లో రైతు పథకాలు లేవు, ‘ఆసరా’నిచ్చేటోళ్లు లేరు, ‘బంధు’వులా.. ‘బీమా’ధీమా నిచ్చేవాళ్లూ లేరు, ఆడబిడ్డల పెండ్లి చేసే ‘కల్యాణలక్ష్మి’ లేదు, గొంతు తడిపే ‘భగీరథుడు’ లేడు, సాగు నీరు అందించే ‘కాకతీయ’ అసలే లేదు. ఈ గోస తీరాలంటే మా గ్రామాలను తెలంగాణలో చేర్చాలి. అది కాని పనా..! అయితే, కేసీఆర్ ప్రధాని కావాలి’ అని చెప్తున్నారు.
మేనమామ మాకూ కావాలి
మహారాష్ట్రలోని చింతలపల్లికి చెందిన తాళ్లపల్లి అంజలి పుట్టిల్లు తెలంగాణే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం ఎల్కపల్లి గ్రామం. ఈమెకు నాలుగేండ్ల కిందట బాపుతో వివాహం జరిగింది. కాన్పు కోసం పుట్టింటికి వచ్చినపుడు ఇక్కడి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకొన్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ.13 వేలతో పాటు, కేసీఆర్ కిట్ కూడా అందుకొన్నారు. కిట్‌ను అందుకొంటూ ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలో లేదని అంజలి చెప్పారు. ఆడబిడ్దలకు కల్యాణలక్ష్మి, కాన్పు కోసం వచ్చిన వారికి కేసీఆర్ కిట్ అందిస్తూ మేనమామ పాత్ర పోషిస్తున్న కేసీఆర్ పాలనే కావాలని అంటున్నారామె. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలో మహిళలకు కష్టం ఉండదని పేర్కొన్నారు.
కర్ణాటకలోనూ తెలంగాణ పథకాలు కావాలంటే..
తెలంగాణలో భూమి ఉండటంతో తమకూ రైతుబంధు అందుతున్నదని అంటున్నారు కర్ణాటకలోని జేగ్రం గ్రామానికి చెందిన ఇడ్లూరు సుభద్రమ్మ. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం ఆగారానికి చెందిన సుభద్రమ్మను కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సైదాపూర్ తాలుకా జేగ్రంకు చెందిన వ్యక్తితో పెండ్లి చేశారు. పెండ్లి సమయంలో ఆమె పుట్టింటివారు ఆగారంలో అర ఎకరం భూమి కానుకగా ఇచ్చారు. దానికి గానూ ఆమె ఏటా రూ.5 వేలు అందుకొంటున్నారు. ఆ పైసలతో జేగ్రంలోని అత్తింటివారి భూమిలో కూరగాయల సాగు చేసుకొంటున్నామని, ప్రతి రోజు రూ.500 సంపాదిస్తున్నామని ఆమె చెప్పారు. ఇచ్చేది తెలంగాణలోనైనా, ఆ పైసలతో కర్ణాటకలోని తమ భూమిలో పంటలను పండించుకొంటున్నామని అన్నారు.కేసీఆర్ ప్రధాని అయితేనే తెలంగాణలో మాదిరి కర్ణాటకలోనూ పంట పెట్టుబడి సాయం, బీమా పథకాలు అమలుచేస్తారని స్పష్టం చేశారు. – సుభద్రమ్మ
రైతుబంధు, రైతుబీమా దేశమంతా అమలుకావాలి
ప్రతి రాష్ట్రంలోనూ తెలంగాణ లాంటి పథకాలు అమలు కావాలని ప్రజలు కోరుకొంటున్నట్టు మహారాష్ట్రలోని రాజూర తాలుకా లకడ్కోట్కు చెందిన రైతు సయ్యద్ హజారొద్దీన్ అంటున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబీమా, రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్తు వంటి పథకాలు దేశమంతా ఉండాలని చెప్తున్నారు. రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ర్టాల మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారు తప్ప ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నాడు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ లాంటి వాళ్లు ప్రధాని అయితేనే బాగుంటుందని చెప్పాడు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్.. ప్రధాని అయితే, దేశంలోని రైతులంతా సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నాడు.
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన రైతులు
తెలంగాణ పథకాలు గొప్పవి
పేరుకు మేం కర్ణాటకలో ఉన్నాం. కానీ రోజూ పక్కనే ఉన్న తెలంగాణ గ్రామాల్లో అభివృద్ధిని చూస్తున్నాం. సంక్షేమాన్ని వింటున్నాం. మా
ఊరులోని కొంతమందికి తెలంగాణలో భూములు ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చేయూతను ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ పథకాలన్నీ దేశమంతా అమలు అవుతాయి. రైతులు, సామాన్యులు బాగు పడతారు. మేము కర్ణాటకలో ఉంటున్నా మా పిల్లలను తెలంగాణలోని గ్రామాలకు ఇస్తున్నాం. – ముత్యాల శ్రీనివాస్, పోచవరం, కర్ణాటక
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశాభివృద్థి జరుగుతుంది. తెలంగాణ మాదిరి దేశమంతా అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం. కేసీఆర్ తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారు. ఆయన ప్రధాని ఆ ఫలాలు ఇతర రాష్ర్టాలకూ అందుతాయి. – సంగమేశ్వర్, మమ్దాపూర్, బీదర్ జిల్లా, కర్ణాటక
దేశాన్ని నడిపించే సత్తా కేసీఆర్‌కు ఉన్నది
కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే తెలంగాణలో అమలయ్యే పథకాలు ప్రతి రాష్ట్రంలో ఉండే అవకాశం ఉన్నది. దేశాన్ని నడిపించే సమర్థుడు. అపార జ్ఞానం, తెలివి ఉన్న కేసీఆర్ అన్ని రాష్ర్టాల నేతల మధ్య సమన్వయం చేసుకొని ముందుకు సాగే సత్తా ఆయనలోనే ఉన్నది.
– వీరేష్ నాయక్, వడ్లందొడ్డి, రాయచూర్ జిల్లా, కర్ణాటక
కేసీఆర్ ప్రకటన చూసి సంతోషపడ్డాం
ప్రధాని మోదీ కూడా గుజరాత్ సీఎం నుంచి దేశానికి పీఎంగా మారిండు. ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నాం. మోదీతో ఎలాంటి ఉపయోగం లేదు. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవికి ఎదగడం చూడాలని ఉన్నది. కేసీఆర్ ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆశ ఉన్నది. దేశ రాజకీయాల్లోకి వస్తానంటూ మొన్న టీవీల్లో కేసీఆర్ చేసిన ప్రకటనను చూసి చాలా సంతోషపడ్డాం.
– ఆలెవర్ రాము, రైతు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం ఆలూర్
8 రాష్ర్టాల్లో ఇలాంటి అభివృద్ధి కనిపించలేదు
నేను 20 ఏండ్లుగా కేఎఫ్టీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు దేశంలోని 8 రాష్ట్రాల్లో తిరిగాను. గుజరాత్, ముంబై, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో వివిధ పనుల కోసం వెళ్లి వస్తుంటాను. నేను వెళ్లిన ప్రతిచోటా ఏడాది నుంచి రెండేండ్ల వరకు అక్కడే ఉండి పనిచేస్తా. ప్రస్తుతం రెండేండ్లుగా గోదావరిఖనిలో పనిచేస్తున్నా. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. ప్రాజెక్టుల నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఇలాంటి అభివృద్ధి దేశమంతటా జరగాలంటే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి.
-రిషి ముని, లారీ డ్రైవర్, అంజూగఢ్, ఉత్తరప్రదేశ్
తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండనిపిస్తుంది
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిబాట పట్టిస్తున్న కేసీఆర్ దేశ ప్రధాని కావాలి. రాష్ట్ర ఉన్నతి కోసం పాటుపడుతున్న ఆయన పీఎం అయితే దేశం బాగుపడుతుంది. పేద ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుంది. మా ఊరు తెలంగాణ పక్కనే ఉన్నా మా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు. మేం కూడా తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులను రాజును చేసేందుకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేస్తే దేశం దశ మారడం ఖాయం.
– బెల్లంకొండ వెంకటేశ్వర్రావు, చింతలపల్లి, మహారాష్ట్ర
కేసీఆర్ అనుకుంటే వదిలిపెట్టడు
తెలంగాణ మాకు కూత వేటు దూరంలో ఉంటుంది. తెలంగాణ రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి అద్భుతమైన పథకాలు ఉన్నాయి. కానీ మాకు మాత్రం అలాంటి పథకాలు లేవు. కేసీఆర్ వంటి వ్యక్తి దేశాన్ని పాలిస్తే దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతుంది. అందుకే కేసీఆర్ ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశమంతా రైతుబంధును ప్రవేశపెట్టాలి. ఆయన అనుకుంటే వదిలిపెట్టడు.
– అంపయ్య స్వామి, రైతు, శక్తినగర్, రాయచూరు జిల్లా, కర్ణాటక
ఏటా రూ.2 లక్షలు వచ్చేవి
నాకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ముగ్గురు కుమారులు. నేను గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాను. మా కుటుంబం అంతా కలిసి వ్యవసాయం చేస్తున్నా వచ్చిన లాభం పెట్టుబడులకు, కుటుంబ పోషణకే సరిపోతున్నది. అది కూడా కాలం కలిసివస్తేనే. ఒక కొడుకును కూలి పని కోసం ముంబైకి పంపిన. మా వ్యవసాయ భూములకు ఆనుకొని ఉన్న తెలంగాణలో రైతులకు అక్కడి ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నది. కర్ణాటకలోనూ ఇస్తే ఏడాదికి రూ.2 లక్షల దాకా వచ్చేది. కేసీఆర్ ప్రధాని అయితే ఆ అదృష్టం మాకు కూడా దక్కుతుంది.
– ద్యావర్ అంజప్ప, మాజీ సర్పంచ్, జేగ్రం, కర్ణాటక
కేసీఆర్ పాలన ఉంటే ప్రజలు సుఖపడతారు
తెలంగాణలో గ్రామాభివృద్ధి బాగుంది. పల్లెల్లో ప్రత్యేక నిధులు కేటాయించి పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, డ్రైనేజీలు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి వసతి, చెత్త తరలించేందుకు ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వీధి దీపాలు, తదితర ఏర్పాట్లు బాగున్నాయి. గ్రామాలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దారు. కొత్త మున్సిపాలిటీలకు రూ.10 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయం. అభివృద్ధిపై అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ పాలన ఉంటే ప్రజలు సుఖపడతారు.
– రాందాస్, పంచలింగాల గ్రామం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్