హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ నెల 16 వరకు అమల్లో ఉంటుంది. అదేరోజు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులకు జరుగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలు జరుగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని పేర్కొన్నది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే అభ్యర్థులు, పార్టీలపై తక్షణమే నోటీసులు జారీచేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జీ లింగయ్యనాయక్ ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, దీనిని కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ముగ్గురు అంతకంటే ఎకువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉన్నట్టు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కోడ్ కింద కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ఎన్ఫోర్స్మెంట్, సర్వైలెన్స్ బృందాలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యులు పరోక్ష ఎన్నికలు ముగిసే వరకు తాము ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.