– నెత్తుటి మరకలు ఆరకముందే మరో ప్రమాదం
– ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణం?
ఖమ్మం రూరల్, జూలై 24 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు డెత్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రోడ్డు ప్రమాదం జరగడం అభంశుభం తెలియని వ్యక్తులు మృత్యువాత పడటం సర్వసాధారణమైంది. మున్సిపాలిటీ పరిధిలో జాతీయ ప్రధాన రహదారుల కలయిక సెంటర్లు ఉండటం, ఈ సెంటర్లలో సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని మున్సిపాలిటీ వాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్, ఏదులాపురం క్రాస్ రోడ్, నాయుడుపేట రింగ్ రోడ్డు వంటి ప్రధాన సెంటర్లు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. నిత్యం ఒకవైపు నేషనల్ ట్రాన్స్పోర్టు వాహనాలు, మరోవైపు లోకల్ వాహనాలు ఈ సెంటర్లలోనే కలుస్తుంటాయి.
దీంతో ఇరువురి డ్రైవింగ్ లో భిన్నంగా ఉండడం, సెంటర్లలో ట్రాఫిక్ పోలీసులు కానీ, సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు తమ ఇష్టానికి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో ఎక్కడి నుంచో వాహనాల ప్రయాణం చేస్తూ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాలకు గురై విగుత జీవులుగా మారుతున్నారు. సెంటర్లలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం, తద్వారా మృత్యువాత పడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపాలిటీ ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు నుండి డిమాండ్ బలంగా వ్యక్తం అవుతోంది. మరి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

డెత్ స్పాట్ సెంటర్లుగా ఈఎంసీ జంక్షన్లు