హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు, మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనుమతుల్లేకుండా పోలవరం-బనకచర్ల, పోలవరం- నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టులను చేపడుతున్నదని ఆరోపించింది. దీంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. నిబంధనల మేరకు మాత్రమే పనులను కొనసాగించేలా చూడాలని, అనుమతిలేని ప్రాజెక్టుల పనులను నిరోధించాలని విజ్ఞప్తి చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం నుంచి 80 టీఎంసీల జలాలను మాత్రమే మళ్లించి కృష్ణా డెల్టాకు మళ్లించాల్సి ఉన్నదని తెలంగాణ పేర్కొన్నది. ఆ మేరకే అవార్డు కేటాయింపులు చేసిందని గుర్తుచేసింది. అవార్డు ప్రకారం పోలవరం కుడి కాలువను 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాల్సి ఉన్నదని తెలిపింది. 2009లో టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) సైతం ఆమేరకే పూర్తయిందని వివరించింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, టీఏసీ అనుమతుల మేరకే ప్రాజెక్టు నిర్మాణాలను అనుమతించారని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీనే చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షించాల్సి ఉన్నదని తెలిపింది. ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు చేపట్టాలన్నా కేంద్రానికే అధికారాలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వానకి ఎటువంటి అధికారాలు లేవని తెలంగాణ తేల్చిచెప్పింది. కానీ, ప్రస్తుతం వాటన్నింటినీ పట్టించుకోకుండా పోలవరం నిర్మాణాన్ని ఏపీ సర్కారే చేపడుతున్నదని వివరించింది.
పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పరిమితికి మించి 17,500 క్యూసెక్కులతో చేపట్టిందని, 10వేల క్యూసెక్కుల సామర్థ్యం చొప్పున నిర్మించాల్సిన రెండు సొరంగాలను 20వేల క్యూసెక్కుల చొప్పున మొత్తంగా 40వేల క్యూసెక్కులతో చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 80 టీఎంసీల మళ్లింపునకు మాత్రమే అనుమతి ఉండగా, ప్రస్తుతం అదనంగా 200 టీఎంసీల జలాలను తరలించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. అందులో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండానే అవార్డుకు విరుద్ధంగా వరద జలాల పేరిట పీబీ లింకు, పీఎన్ లింకు ప్రాజెక్టులు చేపడుతున్నదని, అందుకు అనుగుణంగా పోలవరం సామర్థ్యాలను మరింతగా విస్తరిస్తున్నదని వెల్లడించింది. ప్రాజెక్టు ప్రీఫీజబులిటీ (పీఎఫ్ఆర్) రిపోర్టును ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందని తెలిపింది. సీడబ్యూసీ మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్ఆర్కు సూత్రప్రాయం అంగీకారం వచ్చాకనే డీపీఆర్‌ను తయారుచేయాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో గుర్తుచేసింది. కానీ, ఏపీ ఆ మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కిందని వివరించింది. పీఎఫ్ఆర్కు అనుమతి రాకముందే డీపీఆర్ తయారీకి సిద్ధమైందని, టెండర్లు కూడా పూర్తి చేసిందని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎఫ్ఆర్పై తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు సైతం అభ్యంతరాలను వ్యక్తంచేశాయని వివరించింది.
ఏపీ అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు, ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు సైతం ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అయినప్పటికీ, ఏపీని నిలువరించడంలో ఆయా సంస్థలు విఫలమయ్యాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. నీటి కేటాయింపులు, వాటాలకు సంబంధించిన అంశం కాదని తేల్చిచెప్పింది. ఇది కేవలం మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ అవార్డు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను నిలుపుదల చేయడంతోపాటు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నదని కోరింది. గతంలో ముల్లపెరియార్ డ్యామ్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో ఉటంకించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై తక్షణం జోక్యం చేసుకోవాలని, ఏపీని నిలువరించాలని, తెలంగాణ హక్కులను రక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పిటిషన్‌తోపాటు కేంద్ర సంస్థలకు రాసిన లేఖలు, ట్రిబ్యునల్ అవార్డు ప్రతులను తదితర వాటిని సమర్పించింది.