29న దీక్షాదివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం పలు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మహావృక్షమని.. అజ్ఞానులు చెరపలేని ఆనవాళ్లు ఆయనవి అని చెప్పారు. దీక్షాదివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 26: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి నాడు కేసీఆర్ ఉద్యమ బాటపట్టి, ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి రాష్ర్టాన్ని సాధించటమే లక్ష్యంగా కేసీఆర్ 29 నవంబర్ 2009లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారని తెలిపారు.
ఫలితంగా డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నేతలు ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, నవంబర్ 26: కేసీఆర్ తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ అన్నా రు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో ప్రజలు మోసపోయిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్‌యాదవ్, రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ, నవంబర్ 26 : కేసీఆర్ మాదిరిగా పాలన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేసేందుకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మంగళవారం బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జగదీశ్‌రెడ్డితోపాటు దీక్షా దివస్ ఇన్చార్జులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యా రు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విలన్ పాలన నడుస్తున్నదని, వచ్చే రోజుల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని అన్నారు. దీక్షా దివస్ రోజున కేసీఆర్ దీక్షకు సంబంధించిన ఫొటో ప్రదర్శన చేయాలని, ఉద్యమ జ్ఞాపకాలను ఆవిష్కరించుకోవాలని తెలిపారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26 : 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో ఆమరణ దీక్ష కోసం కరీంనగర్ నుంచి బయలుదేరిన విషయాన్ని గుర్తుచేశారు.
శాసనమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ‘నవంబర్ 29’ సువర్ణాక్షరాలతో లిఖించే రోజని, రాష్ట్రంలో అది ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల విజయ, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.
కామారెడ్డి, నవంబర్ 26: కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి, బీజేపీ కుట్రల నుంచి తెలంగాణను కాపాడేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. కేసీఆర్ త్యాగాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కామారెడ్డి మాజీ ఎమ్మేల్యే గంప గోవర్ధన్ తెలిపారు. కేసీఆర్ త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.
దుండిగల్, నవంబర్ 26 : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండాముంచిందని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మాటలు నమ్మిన ప్రజలు పూర్తిగా మోసపోయారని అన్నారు.కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారని, ప్రస్తుతం రేవంత్ పాలనలో రాష్ట్రం దివాలా తీసినట్టు ఉన్నదని అన్నారు. సమావేశంలో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి. నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉప్పెనలా ఉద్యమాన్ని కొనసాగించి, తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టిన ఫలితంగానే డిసెంబర్ 9న ప్రకటన వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌తోనే తెలంగాణకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 26 : 29న నిర్వహించనున్న దీక్షాదివస్‌కు వేలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్షను ప్రారంభిస్తే డిసెంబర్ 9న కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధనకు కేసీఆర్ చేపట్టిన ఈ దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి క్యామ మల్లేశ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనగామ, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ కరీమాబాద్ : తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. మంగళవారం వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశం ఆయన మాట్లాడారు. కేసీఆర్ కోసం యావత్ రాష్ట్రం ఒక్కటయ్యిందని అన్నారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 29న చేపట్టనున్న దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పార్టీ ముఖ్య నాయకులతో వేర్వేరుగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో జనగామ జిల్లా ఇన్చార్జి బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: ‘కాంగ్రెస్ అంటేనే మోసం. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలు అని నమ్మించిం ది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, పదకొండు నెలలైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకుండా నిండా ముంచింది’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెసోళ్ల మాటలకు మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని, అదే ఇప్పుడు నిజమవుతున్నదని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, డీ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 26: కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ ఏర్పాటైందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులను తరిమికొట్టింది ఈ బ్రహ్మాస్తమ్రేనని ఆయన పేర్కొన్నారు. నేడు మళ్లీ రేవంత్‌రెడ్డి ముసుగులో ఉన్న ద్రోహులను తరిమికొట్టేది ఈ బ్రహ్మాస్త్రమేనని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చితికిపోయిందని, ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవే నిర్బంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితులు నెలకొన్నట్టు తెలిపారు. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షాదివస్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలపై ఉన్నదని అన్నారు.