హైదరాబాద్, ఫిబ్రవరి 8 : పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చర్చ జరగకుండానే ఏపీని విభజించారంటూ పలు సందర్భాల్లో మోదీ చేసిన ప్రసంగాల వీడియోలను ఎమ్మెల్యే బాల్కసుమన్ ‘విశ్వగురు కాదు.. విష గురు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. ఇది కచ్చితంగా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను పదేపదే అవమానిస్తున్నారు. ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను’ ట్వీట్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని మండల, నియోజక వర్గాల కేంద్రాల్లో బీజేపీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. గత ఏడేండ్లుగా తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరించాలని కోరారు.
బీజేపీ తీరును ఎండగట్టండి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తలపెట్టిన నిరసనలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మిన మోదీ తీరును తెలంగాణ వాదులందరూ ఖండించాలని కోరారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు నిరసనల్లో పాల్గొనాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని, నల్లజెండాలతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణపై వ్యతిరేకత రుజువైంది: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమనే విషయం మరోసారి రుజువైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదన్న సంగతి తేలిపోయిందని చెప్పారు. తెలంగాణపై బీజేపీకి, మోదీకి ఎందుకంత అకసు? అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ కాకినాడలో చేసిన తీర్మానానికి అర్థం ఏమిటని నిలదీశారు. తెలంగాణకు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నిలదీశారు.
తెలంగాణపై వివక్షను వీడాలి: కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విజన్‌తో పనిచేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండట్లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లో దళితబంధు, మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’కి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న సందర్భంలో రాష్ర్టానికి ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలలను కేంద్రం మంజూరు చేయట్లేదని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోవట్లేదని చెప్పారు. ఇప్పటికైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. తెలంగాణకు రావాల్సిన పథకాలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.