హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు, ఎంపీల మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్తున్నట్టు వెల్లడించారు. పంచాయతీరాజ్‌శాఖలో 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందనే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పంపించిన లీగల్ నోటీసులపై భట్టి స్పందిస్తూ ‘నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదు. సమయం వచ్చినప్పుడు పార్టీ నుంచి వ్యక్తిగతంగా స్పందిస్తా’ అని తెలిపారు.