హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు నాలుగు గంటల పాటు కలియతిరిగారు. మెయిన్ ఎంట్రన్స్, ల్యాండ్ స్కెప్ ఏరియా, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సీ పనులు, కోర్ట్ యార్డ్ ల్యాండ్ స్కేప్ పనులు, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ వైస్ పనులను పరిశీలించారు. అధికారులకు, వర్క్ ఏజెన్సీకి మంత్రి పలు సూచనలు చేశారు.
నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను,అధికారులను ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.
చారిత్రాత్మక కట్టడమైన ఈ పరిపాలన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ పెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆలోచనల ప్రకారం.. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా సెక్రటేరియట్ తుది దశ పనుల్లో మనసు పెట్టి పనిచేయాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీకి మంత్రి సూచించారు.
మంత్రి వెంట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈఈ శశిధర్, శ్రీనివాస్, పలువురు ఆర్ అండ్ బీ అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.