మారేడ్‌పల్లి, అక్టోబర్ 18: ‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లు తెచ్చారు. చాలెంజ్‌తో ఆయన తీసుకొచ్చిన బీసీ కోటా బిల్లును అసెంబ్లీలోనూ తీర్మానం చేయించారు. అదే బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీ సభ్యులు, గవర్నర్ మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఆ బిల్లుకు ఆమోదం తెలుపకుండా అడ్డుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ దొంగాట ఆడుతున్నది’ అని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. కేంద్రం వద్ద, గవర్నర్ వద్ద ఉన్న బీసీ బిల్లులను కేంద్రం ఆమోదిస్తే 5 నిమిషాల్లో బీసీ కోటా అమలయ్యేదని తెలిపారు. బీజేపీ డ్రామాల వల్లే బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆమె మండిపడ్డారు. బీసీ బంద్ సందర్భంగా సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ వద్ద బీసీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ బిల్లును ఆమోదించకుండా కుట్రలు చేస్తూ బీసీల ద్రోహిగా ఆ పార్టీ మిగిలిందని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోక ముందే మంత్రి కొండా సురేఖ అదే సీఎంను బీసీల అంశంలో ఆకాశానికి ఎత్తడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఓఎస్డీని సీఎం రేవంత్‌రెడ్డి తొలగించడం, అనంతరం ఆమె ఇంటి వద్దకు పోలీసులు మఫ్టీలో వెళ్లడం కలకలం రేపింది. ఆ ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో మంత్రి సురేఖ కూతురు సుస్మిత తీవ్ర పదజాలంతో రెడ్లపై విరుచుకుపడ్డారు. రెడ్లు తమ కుటుంబంపై కక్షగట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తమ తల్లికి హాని తలపెట్టాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో, ఇతర సందర్భాల్లో ఒక మంత్రి అని కూడా చూడకుండా సీఎం రేవంత్‌రెడ్డి తన తల్లిని అనరాని మాటలన్నారని సుస్మిత ఆరోపించారు. జిల్లాకు చెందిన రెడ్డి నేతలు కూడా తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. సీఎం సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారని సమాచారం. తనపై, తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోకుంటే ఎలా అంటూ అధిష్ఠానంతో తన సన్నిహితుల వద్ద పట్టింపులకు పోయినట్టు సమాచారం. ఈ అంశంపై ఓ దశలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. మరునాడు జరిగిన క్యాబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ గైర్హాజరయ్యారు. ఈ పరిణామాల అనంతరం రెండురోజులకే జరిగిన బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ వైఖరిలో మార్పు రావడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడటంపై ఆమె మద్దతుదారులు సైతం విస్మయానికి గురయ్యారు.