Errabelli Dayakar Rao | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, ప్రతి గ్రామం అవార్డులు సాధించిన గ్రామాలతో దాదాపు సమానంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఏ గ్రామంపై వివక్ష లేకుండా ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు గ్రామాలపై ఉన్న శ్రద్ధ, అక్కడి సమస్యలపై ఉన్న అవగాహన, వాటి పరిష్కారాలపై ఆయనకున్న విజన్ రాష్ట్రానికి అత్యధిక అవార్డులు రావడానికి కారణమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు, ఇప్పటి గ్రామాలకు పోల్చిచూస్తే అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిపోతుందని అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ర్టానికి 13 అవార్డులు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు.
సీఎం కేసీఆర్ గ్రామాల గురించి ఆలోచించినంతగా మరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించడంలేదు. ఆలోచించలేరు. ఆయనకు పల్లెలపై ఉన్న మక్కువ, శ్రద్ధ, ప్రేమ, చిత్తశుద్ధి, అక్కడి సమస్యలపై ఆయనకున్న అవగాహన అలాంటిది. అందుకే తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే రాష్ర్టానికి 13 అవార్డులు వచ్చాయి. మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శమే. శాచురేషన్ విధానంలో ఏ గ్రామం పట్ల వివక్ష లేకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి గ్రామం, ఆవాసంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ట్రాక్టర్, డంపింగ్ షెడ్, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేశాం. వివక్ష లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు ఉన్నా నిధులు కేటాయిం చాం. అందుకే గ్రామా లు అభివృద్ధి పథం లో దూసుకెళ్తున్నాయి. అవార్డులు వరిస్తున్నాయి.
కేంద్రం ఇచ్చే నిధుల్లో వివక్ష చూపుతున్నారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నిధులను కూడా చాలా ఆలస్యంగా ఇస్తున్నారు. నిరుడు ఉపాధి హామీ కింద రావాల్సిన రూ.907 కోట్ల నిధులను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఆర్థిక సంఘం నిధుల్లో కోత పెట్టారు. తద్వారా గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమవుతున్నది. నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా రూ.500 కోట్లను జడ్పీ, మండల పరిషత్‌లకు సీఎం కేసీఆర్ ఇచ్చారు.
మిషన్ భగీరథ కింద నది జలాలను ఇంటింటికి నల్లా ద్వారా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇతర రాష్ర్టాల్లో బోరు నీళ్లనే ఇస్తున్నారు. గ్రామ పంచాయతీలపై భారం పడకుండా మిషన్ భగీరథ నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్నది. పారిశుద్ధ్యం, ఇంటింటికి నదీ జలాలను అందించడం ద్వారా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు తగ్గాయి. గ్రామాల్లో ఉండే పాత ఇండ్లను కూల్చివేశాం. పనికిరాని బావులను పూడ్చివేశాం. రోడ్లకు రెండు వైపులా మొక్కలు నాటడంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
ప్రతి గ్రామానికి ట్రాక్టరు ఇవ్వడం ద్వారా గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ షెడ్లలో వేస్తున్నారు. అదే సమయంలో చెత్త నుంచి ఎరువును తయారు చేస్తున్నారు. తద్వారా గ్రామ పంచాయతీలకు డబ్బులు వస్తున్నాయి.
ప్రతి గ్రామానికి కార్యదర్శిని పెట్టాం. ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల పర్యవేక్షణ కోసం అడిషనల్ కలెక్టర్లను నియమించాం. అనేక లొసుగులతో ఉన్న పంచాయతీరాజ్ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాం. గ్రీనరీ కోసం 10 శాతం నిధులు కేటాయిస్తున్నాం. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని నిబంధన విధించాం. ఇలా అన్ని స్థాయిల్లో చేయాల్సిన పనులన్నీ చేశాం. కాబట్టే గ్రామాల్లో ఇంతపెద్ద స్థాయిలో మార్పు సాధ్యమైంది.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపుతున్నది. గతంలో కూలీలకు తట్ట, పార, గడ్డపారలు ఇచ్చేది. ఇప్పుడు బంద్ చేసింది. వీటిని మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద కొనుగోలు చేసే వాళ్లం. వీటిని ఎత్తివేశారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నం. కానీ పట్టించుకోవడంలేదు.
తెలంగాణకు ఇంకా ఎక్కువ అవార్డులు రావాల్సి ఉండే. అవార్డుల్లో కూడా వివక్ష చూపారు. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపు రేఖలు మార్చడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఉన్నది. 24 గంటలు కరెంటు వస్తున్నది. దాదాపుగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నాయి. గ్రామాల్లో వచ్చిన మార్పులను చూసి సెలవులు, శని, ఆదివారాల్లో పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. గ్రామాల్లోనే ఇండ్లు కట్టుకుంటున్నారు.