హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ సన్న ధాన్యం బోనస్‌కు చరమగీతం పాడటానికి రంగం సిద్ధం చేస్తున్నదా? అందుకే ఒక సీజన్లో ఇస్తూ మరో సీజన్లో ఎగ్గొడుతున్నదా? బోనస్ ఇచ్చే సన్నాల రకాలను తగ్గించడం ఇందులో భాగమేనా? ఈ వానకాలం నుంచి అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వదా? అంటే సర్కార్ తీరుతో అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. వానకాలం నుంచి అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వకూడదని, ఎంపిక చేసిన కొన్ని రకాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిజానికి, ధాన్యానికి క్వింటాల్‌కు మద్దతు ధరకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్‌ను సన్న ధాన్యానికి మాత్రమే పరిమితం చేసింది. ఇందులో భాగంగా 37 రకాల సన్నాలను నోటిఫై చేస్తూ వ్యవసాయ శాఖ 2024 జూలై 4న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీటిని ఎనిమిది రకాలకు తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకొన్నది. బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్15048), జైశ్రీరాం, కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్-962, డబ్ల్యూజీఎల్-44, టీజీసీ-1798 ఈ ఎనిమిది రకాల సన్నాలను మాత్రమే సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ వానకాలం నుంచే వీటిని అమలు చేయాలని చెప్తున్నారు.
మిగిలిన 29 రకాల సన్న ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? వాటికి బోనస్ ఇస్తుందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. సన్నాలను తగ్గించడం వెనుక బోనస్‌కు కోత పెట్టాలనే ఆలోచన ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై 29 రకాల సన్నాలను కొనుగోలు చేయబోరని తెలిసింది. కేవలం గుర్తించిన 8 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. సర్కార్ నిర్ణయంతో బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్15048), జైశ్రీరాం, కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్-962, డబ్ల్యూజీఎల్-44, టీజీసీ-1798 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తారని తెలిసింది. ఈ వానకాలం నుంచి ఈ ఎనిమిది రకాల సన్నాలను మాత్రమే కొనుగోలు చేసి వాటికి మాత్రమే బోనస్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో మిగిలిన 29 రకాల సన్నాలకు సర్కార్ బోనస్ పథకాన్ని రద్దు చేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే వేరే రకాల సన్నాలను సాగు చేస్తే సర్కార్ కొనుగోలు చేస్తుందో లేదోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బోనస్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. బోనస్ చెల్లింపు సర్కార్‌కు ఆర్థిక భారంగా మారిందనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. ఈ భారాన్ని తగ్గించుకొనేందుకు ఏకంగా ఈ పథకాన్నే ఎత్తివేసే దిశగా అడుగులు వేసున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్ వేస్తున్న అడుగులు కూడా ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తొలుత బోనస్‌ను ఆలస్యంగా చెల్లించింది. ఆ తర్వాత ఒక సీజన్‌ను ఎగవేసి, ఒక సీజన్‌కు మాత్రమే చెల్లించింది. ప్రస్తుతం బోనస్‌ను యాసంగిలో ఎగవేసి.. వానకాలంలో మాత్రమే చెల్లిస్తున్నది. ఇప్పుడు తాజాగా ఈ వానకాలంలోనూ సన్నాల రకాలను కోత పెట్టడం గమనార్హం. తద్వారా సన్నాల కొనుగోలు భారీగా తగ్గుతుందని, బోనస్ చెల్లింపు భారం తగ్గుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత క్రమంగా వానకాలం బోనస్‌ను ఎగవేసే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రెండు సీజన్ల బోనస్ బకాయి పడింది. గత యాసంగికి సంబంధించి రూ.1,159 కోట్ల బోనస్ ఇప్పటివరకు చెల్లించలేదు. తాజాగా ముగిసిన యాసంగిలో సుమారు 14 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకుగాను రైతులకు రూ.700 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉన్నది. రెండు సీజన్లకు కలిపి బోనస్ బకాయిలు రూ.1,859 కోట్లకు చేరాయి. సన్న ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతులకు నయాపైసా బోనస్ చెల్లించలేదు. చెల్లింపునకు సంబంధించి కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని తెలిసింది. గత యాసంగి మాదిరిగానే ఈ యాసంగిలోనూ బోనస్‌ను ఎగవేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
సిద్ది (డబ్ల్యూజీఎల్44), కంపాసాగర్ వరి-1(కేపీఎస్2874), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి-3 (జేజీఎల్ 27356), జగిత్యాల వరి-2 (జేజీఎల్28545), వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14), వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100), జగిత్యాల మసూరి (జేజీఎల్ 11470), పొలాస ప్రభ (జేజీఎల్ 384), కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458), మానేరు సోనా (జేజీఎల్ 3828), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), వరంగల్ వరి-1119, కునారం వరి-2 (కేఎన్ఎం 1638), వరంగల్ వరి-2 (డబ్ల్యూజీఎల్ 962), రాజేంద్రనగర్ వరి-4 (ఆర్ఎన్ఆర్ 21278), కునారం వరి-1 (కేఎన్ఎం 733), జగిత్యాల సన్నలు (జేజీఎల్ 1798), జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844), కరీంనగర్ సాంబా (జేజీఎల్ 3855), అంజన (జేజీఎల్ 11118), నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్ 34449), ప్రత్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), శోబిని (ఆర్ఎన్ఆర్ 2354), సోమనాథ్ (డబ్ల్యూజీఎల్ 347), ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), జేజీఎల్ 33124 (పీఆర్సీ), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271, బీపీటీ5204, ఆర్ఎన్ఆర్15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం.