Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్లలో ఆయన కనిపిస్తున్న తీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలికి గాయమైన వరుణ్ తేజ్.. ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ‘బరి’ కోసం ప్రత్యేకంగా ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో కాలికి తీవ్ర గాయం అయిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ తర్వాత గత మూడు నెలలుగా వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆగస్టు 7న విడుదల కానున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్ర ప్రమోషన్స్ కోసం వరుణ్ తేజ్ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే ప్రతి ఈవెంట్‌కు ఆయన ఊతకర్ర (స్టిక్) సాయంతోనే నడుస్తూ హాజరవుతున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ సినిమా ప్రచారం కోసం ఆయన చూపిస్తున్న అంకితభావాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. తాజాగా జరిగిన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా వరుణ్ తేజ్ స్టిక్ సాయంతో వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నించగా వరుణ్ స్పందించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. కానీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే నా తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు.
ఈ కామెంట్స్‌తో వరుణ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని స్పష్టమైంది. వైద్యుల సూచనల ప్రకారం పూర్తిగా కోలుకున్న తర్వాతే వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. గాయం ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అభిమానులను కలుస్తున్న వరుణ్ తేజ్‌పై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన పూర్తిగా కోలుకుని త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి రావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.