Ramayana in Pakistan | రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్టున్న రామాయణ (Ramayana) సినిమాను నితీష్ తివారీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 30న తెల్లవారు 5 గంటలకు బ్రహ్మమూర్తాన విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు దాయాది దేశం పాకిస్తాన్లో కూడా ఈ ట్రైలర్ ప్రశంసలు పొందుతుంది. ఈ ట్రైలర్‌ను అక్కడి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. దీంతో అక్కడి సినీప్రియులతో పాటు యూట్యూబర్స్, నిర్మాతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
పాకిస్తానీ ప్రముఖ యూట్యూబర్ మావియా ఉమర్ ఫారూఖీ రామాయణ ట్రైలర్ తన అంచనాలను మించిపోయిందని ప్రశంసించారు. నిర్మాణ విలువలు చూసి ఆశ్చర్యం వేసిందని పేర్కొన్నారు. ఇంతటి ఖరీదైన ప్రాజెక్టును బాలీవుడ్ ఎలా నిర్మిస్తుందని ప్రశ్న లేవనెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలతో సినిమాను నిర్మిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. నెటిజన్లు అది కాదని ఈ సినిమా రెండు భాగాలుగా సుమారు రూ. 4000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తీస్తున్నారని తెలపడంతో అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది భారతీయ, హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా అయినప్పటికీ ట్రైలర్ చూశాక సినిమాను అభినందించలేకుండా ఉండలేకపోతున్నానని వెల్లడించారు.
అదేవిధంగా ట్రైలర్‌లోని నటుల నటన, డైలాగులు బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రావణుడిగా రాక్‌స్టార్ యష్ (Yash), రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్లో ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా నిలుస్తుందని వారు అభిలషిస్తున్నారు.
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈ ఏడాది దివాళికి, రెండో పార్ట్ వచ్చే ఏడాది దివాళికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్‌గా ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇతిహాస గాథ అయిన రామాయణ ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. దీనిలోని ధర్మం, మర్యాద, ధైర్యం, కరుణ, మాట విలువ ఆదర్శాలే ఈ స్ఫూర్తికి కారణం.