హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు రంగంలో మిరుమిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్తు రంగం అత్యంత కీలకమైనది. అలాంటి రంగంలో దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖ చిత్రం-2023లోని గణాంకాలు తెలంగాణ విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతిని కండ్లకు కడుతున్నాయి. ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు సాగించిన కృషితో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 9,470 మెగావాట్ల (2014-15) నుంచి 18,069 మెగావాట్లు (2021-22)కు చేరింది. తలసరి విద్యుత్తు లభ్యత 1,152 కిలోవాట్ అవర్ నుంచి 2,005 కిలోవాట్ అవర్‌కు చేరుకున్నది. అంటే 1.74 రెట్లు పెరిగింది. అదే సమయంలో జాతీయ సగటు తలసరి విద్యుత్తు లభ్యత కేవలం 1.31 రెట్లు పెరిగింది.
ట్రాన్స్మిషన్ నష్టాలను ఆరేండ్లలో 15.28 శాతానికి తగ్గించగలిగారు. అదే జాతీయ స్థాయిలో 2019-20లో 20.46 శాతం నష్టాలు ఉన్నాయి. దేశంలోనే అతి తక్కువ ట్రాన్స్మిషన్ నష్టాలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ 4వ స్థానంలో, దక్షిణాదిలో రెండో స్థానంలో నిలిచింది. 24 గంటల విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తుండటంతో వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 39,519 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం ఉంటే.. 2021-22 నాటికి 61,267 మిలియన్ యూనిట్లకు చేరింది. తలసరి విద్యుత్తు వినియోగంలోనూ గణనీయ ప్రగతి సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1,356 యూనిట్ల వినియోగం ఉండగా.. 2021-22 నాటికి 2,126 యూనిట్లకు చేరుకొన్నది. సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2021-22 నాటికి 4,432 మెగావాట్లకు చేరుకొని, ఎనిమిదేండ్లలో 59 రెట్లు పెరిగింది. ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని పక్కాగా అమలుచేస్తున్నది.