హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అనుమతులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. తక్షణం ఆ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మరోసారి రెండు రివర్ బోర్డులకు తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ లేఖలు రాశారు.
జీబీ లింక్ ప్రాజెక్టు పనులకు కావాల్సిన నిధుల సమీకరణకు ఏపీ సర్కారు ఇటీవల జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఏపీ ముందుకు పోతున్నదని, ఇకనైనా స్పందించి ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు.
జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అళగేషన్పై ఆర్థిక అవకతకవలు, ఉద్యోగుల వేధింపులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఇటీవల నిర్వహించిన జీఆర్ఎంబీ సమావేశంలో అందుకు సంబంధించి కేఆర్ఎంబీ మెంబర్, ఇరు రాష్ర్టాల సీఈలతో త్రిసభ్య కమిటీని వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ విచారించాల్సిన అంశాలను తెలంగాణ సర్కారు తాజాగా సూచించింది. ఈ మేరకు లేఖ రాసింది.