సారంగాపూర్, జూలై 5: గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు (Kreeda Pranganam) నిరుపయోగంగా మారాయి. సారంగాపూర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు నేడు ఆటకు నోచుకోక వెలవెలబోతున్నాయి. క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఒక్కొక్క మైదానానికి రూ.లక్ష నుంచి 2 లక్షలు ఖర్చు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని పంచాయతీలకు నిధులు మంజూరు చేసి అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేడు క్రీడలకు నోచుకోక ప్రాంగణాల్లో గడ్డి మొలుస్తుంది. అధికారుల పర్యవేక్షణ మూలంగా అస్తవ్యస్తంగా మారాయి.
క్రీడా ప్రాంగణాల నిర్మాణం పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దీనికి తోడు అధికారులు గాలికి వదిలేయడంతో అనేకచోట్ల కేవలం నామమాత్రంగా తయారయ్యాయి. చాలాచోట్ల ఊరికి దూరంగా ఉండటంతో వాటిని ఉపయోగించుకోలేదని పరిస్థితి నెలకొంది. క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్నాయి. అలాగే క్రీడా ప్రాంగణాల నిర్వహణ లేకపోవడంతో పశువులకు ఉపయోగకరంగా మారాయి.
క్రీడా ప్రాంగణాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలి. క్రీడలకు అవసరమైన పరికరాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. క్రీడా ప్రాంగణాలను స్థానికుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేయాలి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి వినియోగంలోకి తీసుకురావాలని మండల క్రీడాకారులు కోరుతున్నారు.
అధికారులు క్రీడా ప్రాంగణాలను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయని ఆడెపు మహేష్ అనే క్రీడాకారుడు అన్నారు. దీంతో చాలామంది క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారు. క్రీడా ప్రాంగణాలు నిర్వాణ లేక పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. అధికారులు పట్టించుకోని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వాణ కరువైందని బూర్ల పోతున్న అనే క్రీడాకారుడు విమర్శించారు. ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయిస్తే క్రీడాకారులు ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా నిధులు కేటాయిస్తే క్రీడాకారులు ఆటలపై ఆసక్తి కనబరుస్తారు. అలాగే ప్రభుత్వం ఆట వస్తువులను కూడా సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పారు.