హైదరాబాద్,జూలై 8 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా ప్రభుత్వ పరంగా గుర్తించాలని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కే కేశవరావును తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకులు బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులను ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమానికి సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా టీజేఎఫ్ నాయకులు అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వారి కుటుంబాలకు తగిన ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేలా కమిటీ తరఫున సిఫార్సులు చేయాలని కోరారు. జర్నలిస్టులు, ఉద్యమకారుల సమస్యలపై ఫోరం ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ తెలిపారు. టీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహేశ్వరం మహేంద్ర చారి, కార్యదర్శులు ముద్దం స్వామి, పాలకూరి రాజు, చంటి, కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.