హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ) : కలం కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎప్పుడూ లేని కొత్త నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. పలు వేదికలపై ఆర్భాటంగా ‘44వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులిస్తాం’ అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలు చేసినా అమలైన దాఖలాల్లేవు. ఇప్పటివరకు అక్రెడిటేషన్ల కోసం 40వేల దరఖాస్తులు చేసుకుంటే, వాటిలో 15వేల కార్డులకే ఆమోదం తెలుపగా, 20వేల కార్డులే జారీ అయ్యాయి. అంటే సగం కార్డులకు సర్కార్ కోత పెట్టింది. అర్హులైన జర్నలిస్టులకు హక్కుగా రావాల్సిన ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వకుండా కొర్రీలు పెడుతుండటమే గాక ‘ఇస్తే తీసుకో.. ఇచ్చినప్పుడు తీసుకో’ అన్నట్టు వ్యవహరిస్తుండటంపై జర్నలిస్టుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కార్డుల జారీలో సాగదీతలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయింది. ఈ రెండున్నరేండ్లు గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన కార్డులే కొనసాగాయి. ఇటీవల కొందరికి కొత్త కార్డులిచ్చినా.. పాతకార్డులు(రాని వారికి) ఇంకా చెల్లుబాటవుతున్నాయి. కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జీవో తీసుకొచ్చింది. ఏప్రిల్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ ఇప్పటివరకు సగం మందికి మాత్రమే కార్డులందాయి. గ్రేడింగ్ విధానం, క్యాటగిరీ పేరిట కార్డులకు భారీగా కోతలు పెట్టింది. ‘ఏ’ కేటగిరీలో ఉన్న పేపర్లను బీ కేటగిరీ, ‘బీ’ క్యాటగిరీలోని పేపర్లను ‘సీ’ కేటగిరీలోకి మార్చి కోతలు పెట్టారు. గతంలో ఎడిషన్ కేంద్రాల్లో డెస్క్, బ్యూరోలో 8 చొప్పున ఉండగా, ప్రస్తుతం అన్ని కలిపి 8కి కుదించారు. నియోజకవర్గ కార్డులను ఎత్తేశారు. లక్ష జనాభా దాటిన మండలాల్లో గతంలో రెండు కార్డులివ్వగా, ప్రస్తుతం ఒక కార్డు మాత్రమే ఇచ్చారు. కేబుల్ చానళ్లకు ఇప్పటివరకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. 60కి పైగా కేబుల్ చానల్స్‌కు స్టేట్, జిల్లా కార్డులు అందలేదు. ఇంకా కొందరు ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులకు కార్డులివ్వలేదు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాలున్న ప్రాంతాల్లో మూడు ప్రధాన పత్రికల రిపోర్టర్లకు మాత్రమే కార్డులిచ్చారు. ఎలక్ట్రానిక్, మిగిలిన ప్రింట్ మీడియాకు కార్డులివ్వలేదు.
కేసీఆర్ కోటా పెంచితే.. కాంగ్రెస్ కొత్త చిక్కులు తెచ్చింది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రిపోర్టర్లు, డెస్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసింది. కార్డుల కోటాను పెంచింది. కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పనిచేసే వారికి కార్డులిచ్చింది. లక్ష జనాభాకు ఒకటి చొప్పున మండలంలో ఎంత జనాభా ఉంటే అన్ని కార్డులిచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను భారీగా కుదించింది. నూతన అక్రెడిటేషన్ పాలసీ పేరిట జీవో-252 జారీచేసింది. రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డుల అంటూ రెండు రకాల కార్డులు ఇస్తామంటూ రంగులు మార్చి జర్నలిస్టుల మధ్య విభజన రేఖ గీసింది. అంతేగాక ఇచ్చే కార్డుల సంఖ్య విషయంలోనూ అనేక పరిమితులు విధించింది. ఈ నిర్ణయాన్ని డెస్క్ జర్నలిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని పలుమార్లు ముట్టడించి ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలపై నిరసనలు తెలిపారు. సర్కార్ నిర్ణయాలను ఉపసంహంచుకోవడమే కాకుండా జీవోను సవరించాల్సి వచ్చింది. జీవో-252పై ఉర్దూ జర్నలిస్టులు, పలు సంఘాలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ రిట్ పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుత కార్డులు చెల్లుబాటును పొడిగించాలని కోర్టు సర్కార్‌ను ఆదేశించింది. దీంతో అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును తరచూ పొడిగిస్తున్నారు.
జనగామ జర్నలిస్టులపై కాఠిన్యం
జనగామ జిల్లాలో జర్నలిస్టులపై ప్రభుత్వం కక్ష గట్టింది. అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేయించింది. ఈ జిల్లాలో 360మంది అక్రెడిటేషన్ల కోసం దరఖాస్తు చేస్తే అర్హత కలిగిన 288మందికి కమిటీ ఆమోదం తెలిపింది. కార్డులు జారీ అవుతాయనుకున్న తరుణంలో 160మంది జర్నలిస్టుల జాబితాను ఎస్బీ, ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించి విచారణ చేయించింది.
గుర్తింపే కాదు.. సంక్షేమ కార్డు
జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డు కేవలం గుర్తింపు కార్డే కాదు. ఇది జర్నలిస్టు సంక్షేమ కార్డు కూడా. ప్రభుత్వం ద్వారా వర్తించే పథకాలకు ఈ కార్డే ప్రామాణికం. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలందిస్తున్న ఈజేహెచ్ఎస్ హెల్త్ కార్డులను అక్రెడిటేషన్ కార్డుల ద్వారానే ఇస్తున్నారు. ఈ కార్డుతోనే నిమ్స్లోనో లేక గాంధీ, ఉస్మానియాల్లోనే జర్నలిస్టులు కాస్తోకూస్తో చికిత్స పొందుతున్నారు. అక్రెడిటేషన్ కార్డులున్న వారు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకోవాలని సమాచార శాఖ ఉత్తర్వులిచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో రైల్వే చార్జీల్లో రాయితీని ఎత్తివేసింది. ఈ రాయితీని ఇంతవరకు పునరుద్ధరించలేదు. టోల్చార్జీల్లో మినహాయింపు ఇవాల్సి ఉన్నా ఇది వర్తించడంలేదు. గతంలో కార్డులు పొందిన 44వేల మంది జర్నలిస్టులు ఈ సేవలను పొందారు. అయితే ఇప్పుడు 20వేల లోపే కార్డులివ్వడంతో మిగతా వారు హెల్త్‌కార్డుకు దూరం కానున్నారు.
కమిటీల్లో నియంతృత్వం రాజ్యమేలుతున్నది
అర్హులైన జర్నలిస్టులకు ఇంకా అక్రెడిటేషన్ కార్డులు అందలేదు. ఈ కమిటీల్లో ఒక యూనియన్ వాళ్లను నియమించిన ఫలితంగా కమిటీల్లో నియంతృత్వం రాజ్యమేలుతున్నది. అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. ఏకపక్షంగా కార్డులను జారీచేస్తున్నారు. దీనిని మేం నిరసిస్తున్నాం. ఈ నెల 13న సోమవారం సమాచార భవన్‌ను ముట్టడించి నిరసన తెలుపుతాం.
– రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్, యాక్టింగ్ ప్రెసిడెంట్