హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనబాట పట్టనున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగనున్నది. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో పాటు మొత్తం 64 డిమాండ్లను నెరవేర్చాలని జేఏసీ ఇప్పటికే సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా మండల, డివిజన్, జిల్లాకేంద్రాలు సహా హైదరాబాద్‌లోని అన్ని హెచ్‌వోడీ కార్యాలయాల్లో నిరసనలు తెలుపనున్నారు. ఈ మేరకు గురువారం అన్ని స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి నిరసన కార్యక్రమం గురించి ముందస్తు సమాచారాన్ని లేఖ ద్వారా అందించాలని, ఉదయం 10:30గంటలకే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని వారు కోరారు.