రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ప్రజాదీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకిత భావంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకొని 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం వార్షిక వృద్ధిరేటుతో దేశంలో అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలు, కరోనా లాంటి విపత్తులు వచ్చినా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాతబస్టాండ్‌లోని అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధుకు 2018లో శ్రీకారం చుట్టినట్టు కేటీఆర్ తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే 2.4 లక్షల మంది రైతులకు రూ.945 కోట్ల పెట్టుబడి సాయం అందిందన్నారు. రైతులకు సుస్థిర ఆదాయం రావాలన్న ఉద్దేశంతో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించామన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయం
కాలంతో పోటీపడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని కేటీఆర్ చెప్పారు. గోదావరి జలాల రాకతో మెట్ట భూములు సస్యశ్యామలమయ్యాయని అన్నారు, నాటి ఉమ్మడిపాలనలో సాగునీటికి నోచుకోని మెట్ట భూములకు శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ జలాశయాలు ప్రాణం పోశాయని వివరించారు. మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానున్నదని, శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) కేంద్రంగా రూ.2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 500 ఎకరాల్లో అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించేలా అమెరికాకు చెందిన ఫిష్ఇన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొన్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కాళేశ్వరంతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చిందని, ఈ పునాదితో పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంసం ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడి పశువుల అభివృద్ధి వల్ల క్షీర విప్లవాలను త్వరలోనే చూస్తామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందని, మెజార్టీ జలవనరులు జలకళను సంతరించుకొన్నాయని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్ భగీరథ విజయవంతమైందని, నీతి అయోగ్ నుంచి ప్రశంసలు దక్కడం గర్వకారణమన్నారు.
పేదల ఆత్మగౌరవం.. డబుల్ బెడ్రూం ఇండ్లు
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,886 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, 3,402 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులను సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆదుకుంటున్నారని, గతంలో రూ. 200 ఉన్న పింఛన్లను రూ.2016కు పెంచామన్నారు. పేదింటి ఆడపిల్ల పెండ్లి బరువు తీర్చేందుకు ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగి పేదలకు ఆర్థిక భారం తగ్గిందని అన్నారు. ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలకు మసీదులు, షాదీఖానాలు, చర్చిలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం నిధులు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
త్వరలో సిరిసిల్లలో జేఎన్టీయూ
విద్యా ప్రమాణాల పెంపుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.9.6 కోట్లతో సర్దాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుచేశామని, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.16.48 కోట్లతో మండెపల్లి శివారులో 20 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో సూపర్ టెక్నాలజీతో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. గంభీరావుపేట మండలం నర్మాలలో 309 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లో రూ.100 కోట్లతో రెండు పరిశ్రమలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.