కరీంనగర్ : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూరు, ముగ్దంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Paddy purchase centres) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు 15 రోజులు ముందుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభించామని వెల్లడించారు . ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా శనివారం నాటికి 420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రూ. 4.15 కోట్ల విలువ చేసే 2000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.
పండించిన ధాన్యాన్ని నిబంధనలకు లోబడి కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని రైతులకు సూచించారు. ఒక్కో గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఇన్ప్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. స
మైక్య పాలనలో సాగునీరు లేక సగం భూమిపెట్టిన రోజులు ఉండేవని, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు. పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురమల్ల లలిత, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్ వేణి మధు, తదితరులు పాల్గొన్నారు.