సంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలపై మోదీ పాలనలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్‌స్ట్రైక్స్ ఉంటాయని హెచ్చరించారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పటేల్‌గూడలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో వర్చువల్‌గా రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీజేపీ నిర్వహించిన ప్రజా సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వనని, రాష్ట్ర అభివృద్ధిని రెండింతలు చేసి చూపుతానని తెలిపారు.
ఇందుకోసం తెలంగాణతో పాటు దేశంలోని ప్రజలంతా మూడోసారి బీజేపీకి పట్టం కట్టాలని, 400 ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. మోదీ గ్యారంటీ ఇస్తే పక్కా జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలపై మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అవినీతిని బట్టబయలు చేస్తుండటంతో ఆ పార్టీ తనపై విమర్శలు చేస్తున్నదని వెల్లడించారు.
తనకు కుటుంబం లేదంటూ ఇండియా కూటమి తనపై అనైతిక యుద్ధానికి దిగుతున్నదని చెప్పారు. దేశంలోని ప్రతి వ్యక్తి మోదీ కుటుంబసభ్యుడేనని, తనను ప్రజలంతా తమ కుటుంబసభ్యునిగా భావిస్తున్నారని అన్నారు. వారసత్వ రాజకీయ పార్టీలకు మోదీ భయం పట్టుకున్నదని తెలిపారు. దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థికశక్తిగా తీర్చిదిద్దుతానని, ఇది తన గ్యారెంటీ అని వెల్లడించారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా అవుతుందని అన్నారు.
నన్ను దూషించే పనిలో ఇండియా కూటమి
కాంగ్రెస్ సహా కుటుంబ పార్టీలకు మోదీ భయం పట్టుకున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు మోదీని దూషిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మోదీ కంట్లో నలుసులా మారారని తెలిపారు. ఆ పార్టీ చేసిన అవినీతిని బయటపెడుతున్నానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది తప్ప యువ నాయకులకు పదవులు ఇవ్వదని విమర్శించారు. తాను మాత్రం తన వేతనం, తనకు వచ్చిన బహుమతులను దేశాభివృద్ధ్ధ్ది, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఇంతవరకు తనకు సొంత ఇల్లు కూడా లేదని తెలిపారు.
మోదీ సభలో ఖాళీ కుర్చీలు
మోదీ బహిరంగ సభలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ నాయకులు ప్రచారం చేయగా, మంగళవారం జరిగిన బహిరంగ సభకు పూర్తిస్థాయిలో జనం హాజరు కాలేదు. దీంతో చాలాచోట్ల ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వీఐపీ గ్యాలరీ సైతం నిండకపోవటంతో వీఐపీ పాసులు లేకున్నా కార్యకర్తలను వీఐపీ గ్యాలరీల్లో కూర్చోబెట్టారు. బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా జనసమీకరణ ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో పార్టీ అగ్రనాయకులు జిల్లా నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై మోదీ ప్రసంగం కొనసాగిస్తుండగానే ప్రజలు బహిరంగ సభ నుంచి వెళ్లిపోవటం కనిపించింది.
తెలంగాణలో రాహుల్ ట్యాక్స్: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మార్పు కనిపిస్తుంది అనుకుంటే ఎక్కడా మార్పు కనిపించటం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆ పార్టీ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న తలంపుతో ఈ పన్ను వసూలు చేస్తున్నదని ఆరోపించారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి రాహుల్ ట్యాక్స్ పేరుతో డబ్బు లు వసూలు చేసి పంపుతున్నట్టు తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ నేతలు కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీబీపాటిల్, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.
దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ: మోదీ
దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వే లాంటిదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా రూ.7,200 కోట్ల పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.1,298 కోట్లతో నిర్మించనున్న సంగారెడ్డి చౌరస్తా-మదీనగూడ ఆరు లేన్ల 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3,338 కోట్లతో నిర్మించిన పారదీప్-హైదరాబాద్ గ్యాస్ పైప్‌లైన్‌ను మోదీ ప్రారంభించారు. రూ.1,409 కోట్లతో నిర్మించిన కంది-రామసానిపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులను జాతికి అంకితం చేశారు. రూ.400 కోట్లతో బేగంపేటలో నిర్మించిన సివిల్ ఏవియేషన్ రిసెర్చ్ సెంటర్, ఘట్కేసర్-లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలును, రూ.1,165 కోట్లతో చేపట్టనున్న హైదరాబాద్-సికింద్రాబాద్ రెండోదశ ఎంఎంటీఎస్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు.
కోమటిరెడ్డి వినతిపత్రాన్ని పట్టించుకోని మోదీ
రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. వేదికపై ప్రధాని ప్రసంగించేందుకు వెళ్తుండగా వినతిపత్రాన్ని ఇచ్చేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నించగా, దాన్ని మోదీ స్వీకరించలేదు. దీంతో కోమటిరెడ్డి కొంత అసంతృప్తి గురయ్యారు.