న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కాలేజ్ డెన్సిటీలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ‘రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. 2021-22లో తీసుకున్న లెక్కల ఆధారంగా పలు అంశాలను ఈ నివేదికలో వెల్లడించింది. కాలేజ్ డెన్సిటీ (18-23 ఏండ్ల మధ్య వయసు ఉన్న లక్ష మంది జనాభాకు ఉన్న కళాశాలల సంఖ్య సగటు)లో జాతీయ సగటు 30 ఉండగా, తెలంగాణ 52 కళాశాలలతో దేశంలో రెండో స్థానంలో ఉంది. 18-23 ఏండ్ల వయసు వారు ఉన్నత విద్య కోసం నమోదు చేసుకునే నిష్పత్తి(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో)లోనూ తెలంగాణ ముందంజలో ఉంది. 2021-22లో ఈ నిష్పత్తిలో జాతీయ సగటు 28.4 శాతం ఉండగా తెలంగాణ 40 శాతంతో దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. కాగా, 1950-51లో దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 0.4 శాతం ఉండగా ఇప్పుడు 71 రెట్లు పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.