హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. దేశంలోనే అత్యధికంగా బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత ప్లస్‌ప్లస్ (ఓడీఎఫ్++) గ్రామాలున్న రాష్ట్రంగా రికార్డు నెలకొల్పింది. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ఇందుకు దోహదం చేసింది. రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 6,537 గ్రామాలు (46 శాతం) ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ విభాగంలో చేరాయి. దేశంలోని మొత్తం ఓడీఎఫ్++ గ్రామాల్లో మూడో వంతు గ్రామాలు తెలంగాణలోనే ఉండటం మరో విశేషం. ఈ విషయాలను కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని స్వచ్ఛ భారత్మిషన్ శుక్రవారం ప్రకటించింది. కేవలం మరుగుదొడ్లు మాత్రమే నిర్మించిన గ్రామాలను ఓడీఎఫ్ విభాగంలో చేరుస్తారు. ఓడీఎఫ్++ హోదా పొందాలంటే.. గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను సమకూర్చడం, ప్రతి నెలా నిధులు విడుదల చేయడం, శ్మ శానవాటికలు, ఇంకుడు గుంతలు నిర్మించడం, రోడ్లపై నీరు నిల్వకుండా చూడటం వంటి అనేక కార్యక్రమా లు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం, స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ను నియమించడం, పచ్చదనానికి ప్రా ధాన్యం ఇవ్వడం తదితర చర్యల కారణంగా దేశంలోనే తెలంగాణ ముందు నిలిచింది. ఏ రాష్ట్రం కూడా ఇన్ని కార్యక్రమాలను చేపట్టడంలేదు. దీంతో రాష్ట్రంలోని అత్యధిక గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా నిలిచాయి. త్వరలోనే వంద శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ క్యాటగిరీలోకి రానున్నాయి. రాష్ట్రంలోని 98 శాతం గ్రామాల్లో డంపింగ్ యార్డులు, 90 శాతం గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తవ్వడం విశేషం.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి ద్వారానే తెలంగాణ పల్లెలు దేశంలోనే అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచాయి. గ్రామానికో ట్రాక్టర్, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, శ్మశానవాటికల నిర్మాణంలో తెలంగాణ ముందున్నది. ఇందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు అభినందనలు.
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు