హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. సొంతకాళ్లపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. రాష్ర్టానికి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులను మోదీ ప్రభుత్వం విడుదల చేయకున్నా.. స్వశక్తితో నిధులను సమకూర్చుకుంటున్నది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాలు రాకుండా, హక్కులు దక్కకుండా అవస్థలు పెడుతున్నా..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతో ముందుకెళుతున్నది. రాష్ట్రం తనకాళ్లపై తాను నిలబడుతూ ఏటికేడు సొంత పన్నుల రాబడుల్లో గణమైన వృద్ధిరేటును సాధిస్తున్నది. గడిచిన ఆరేండ్లలో అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధిరేటు 11.5 శాతంగా నమోదైంది. ఇది దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అత్యధికం. అతి తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.
తెలంగాణ ఫస్ట్… గుజరాత్ లీస్ట్
సొంత పన్నుల రాబడిలో సగటు వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవగా, గుజరాత్ చివరి స్థానానికి పరిమితమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు పన్నుల రాబడిలో తెలంగాణ 11.5 శాతం సగటు వార్షిక వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఒడిశా 9.7, హర్యానా 9.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ 8.6 శాతానికే పరిమితమైంది.
ఇక బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ తెలంగాణ కంటే తక్కువ వృద్ధిరేటునే నమోదు చేశాయి. మధ్యప్రదేశ్ 7 శాతం, మహారాష్ట్ర 6.7 శాతం, కర్ణాటక 5.7 శాతం నమోదు చేశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్‌లో 7.8 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 6.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇక, దేశానికే రోల్‌మాడల్ అని మోదీ భజన బృందం, బీజేపీ అధినాయకత్వం పదేపదే వల్లె వేస్తున్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచింది. గడిచిన ఆరేండ్లలో పన్నుల రాబడిలో గుజరాత్ సాధించింది కేవలం 2.6 శాతం మాత్రమే. గుజరాత్‌తో పోలిస్తే తెలంగాణ సుమారు 9 శాతం అధిక వృద్ధిరేటుతో అగ్రస్థానంలో నిలిచింది.
పన్నుల రాబడిలో అనూహ్య వృద్ధి…
ఎనిమిదేండ్లలో సొంత పన్నుల రాబడిలో తెలంగాణ అనూహ్యమైన వృద్ధిరేటును సాధించింది. 2014-15 లో పన్నుల రాబడి కేవలం రూ.29,288 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 2015-16లో రూ.39,975 కోట్లు ఉండగా, ఆ తర్వాత 2016-17లో రూ.48,408 కోట్లు, 2017-18లో రూ. 58,177 కోట్లు, 2018-19లో రూ.65,040 కోట్లు, 2019-20లో రూ.67,597 కోట్లు, 2020-21లో రూ.79,196 కోట్లకు ఎగబాకింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.92,910 కోట్లకు చేరింది. ఎనిమిదేండ్లలో సుమారు మూడురెట్లు పెరిగింది. గడిచిన ఆరేండ్లలో సొంత పన్నుల రాబడిలో ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 8.4 శాతంగా ఉండగా, తెలంగాణలో 11.5 శాతంగా నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలన్నింటినీ వెనక్కి నెట్టి అనూహ్యంగా దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.
రాష్ర్టాల వార్షిక సగటు వృద్ధి(స్పెషల్ క్యాటగిరీ రాష్ర్టాలు మినహా)
రాష్ట్రం : వృద్ధిరేటు(శాతాల్లో..)
తెలంగాణ : 11.5
ఒడిశా : 9.7
హర్యానా : 9.2
జార్ఖండ్ : 8.9
ఉత్తరప్రదేశ్ : 8.6
ఆంధ్రప్రదేశ్ : 8.4
రాజస్థాన్ : 7.8
పశ్చిమబెంగాల్ : 7.5
బీహార్ : 7.3
మధ్యప్రదేశ్ : 7.0
మహారాష్ట్ర : 6.7
ఛత్తీస్‌గఢ్ : 6.5
కర్ణాటక : 5.7
కేరళ : 5.3
తమిళనాడు : 5.2
పంజాబ్ : 2.8
గుజరాత్ : 2.6
గోవా : 1.7
సొంత పన్నుల రాబడిలో తెలంగాణ వృద్ధి ఇలా…
ఆర్థిక సంవత్సరం : సొంత పన్నుల రాబడి (రూ.కోట్లలో)
2014-15 : 29,288
2015-16 : 39,975
2016-17 : 48,408
2017-18 : 58,177
2018-19 : 65,040
2019-20 : 67,597
2020-21 : 79,196
2021-22 : 92,910