హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పత్తి నిల్వ లు ఖాళీ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో పత్తి వేసినా డిమాండ్ ఉంటుందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో రైతులవారీగా, కమతాలవారీగా ఇన్సూరెన్స్ కల్పించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని అన్నారు. ప్రమాద బీమా మాదిరిగానే పంటల బీమాను కూడా వ్యక్తిగతం చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో 2022-2023 నాటికి 6,246 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సాధిస్తామని ఇంధనశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రూఫ్‌టాప్ విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రూఫ్‌టాప్ ద్వా రా వినియోగదారులు 1 నుంచి 3 కిలోవాట్ల వరకు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నెట్ మీటరింగ్ ద్వారా రూఫ్‌టాప్ ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటుకు ప్రోత్సహించాలని కోరారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కేంద్రం వాటా 15% మాత్రమేనని, మూడేండ్లుగా పైసా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం రాష్ర్టానికి రూ.వందల కోట్లు బకాయి ఉన్నదని తెలిపారు. సమగ్రసర్వేలో ఇండ్లు లేనివారు దాదాపు 26,31,739 మంది దరఖాస్తు చేసుకొన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,91,000 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 2,27,000 ఇండ్లను మొదలుపెట్టామని, 1,03,000 ఇండ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మరో 70 వేల ఇండ్లు 90 శాతం పూర్తయ్యాయని, 53,000 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణం కోసం రూ.10,442 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఇండ్ల స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.