14 ఏండ్లు పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడారు. సబ్బండ వర్ణాల సంక్షేమంగా పదేండ్ల పాలన సాగింది. కరోనాలోనూ కేసీఆర్ సర్కారు ఇచ్చిన గుండెధైర్యం, బతుకు భరోసా యావత్ భారతం చూసింది.కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో అంతా తెర్లమర్లయ్యింది. 20 నెలలుగా రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 20 నెలల కాలంలో అన్ని రంగాల్లోనూ అభద్రతే నెలకొన్నది. నైరాశ్యం నిండిన జనం ఆత్మహత్యల పాలవుతున్నా సర్కారులో పట్టింపులేదు. రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నాడు చేనేత ఆర్డర్లతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారింది. ఎవరికీ పట్టని స్థితిలో గురుకులాలు.. గుక్కపట్టి ఏడుస్తున్నాయి. బిల్లులు రాక సర్పంచులు, ఉద్యోగ భద్రత లేక పోలీసులు.. ఆఖరికి హైడ్రా పుణ్యమా అని రియల్టర్లు, బిల్డర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 600 రోజులు గడిచాయి. నాటి నుంచి గురువారం వరకు 713 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతులే కాదు.. చేనేత కార్మికులు, ఆటో డైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, మాజీ సర్పంచులు, పోలీసులు కూడా ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. పెట్టుబడిసాయం అందక, రుణమాఫీకాక, గిట్టుబాటు ధర రాక, ఆరుగాలం కష్టపడి పడించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక, నీళ్లు అందక కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కండ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక.. రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక జిల్లాలో అన్నదాతలు ఉరికొయ్యలకు వేలాడుతూనే ఉన్నారు. మళ్లీ పురుగుల మందును ఆశ్రయిస్తూ మట్టిపూలు రాలుతూనే ఉన్నాయి.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు ఆనందంగా బతికితే రేవంత్‌రెడ్డి పాలనలో ఆందోళనకర పరిస్థితులు వచ్చాయి. నేడు పంజాబ్‌ను దాటి దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన తెలంగాణ.. రైతులో ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి దారుణమైన పరిస్థితులను రైతులు చవిచూడాల్సి వస్తున్నది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ సర్కారు అమలు చేయకపోవడంతో భరోసా కరువై రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ నమోదవుతున్నాయి. రేవంత్‌రెడ్డి 600 రోజుల పాలనలో ఇప్పటి వరకు (ఆగస్టు 29) 713 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 692 మంది పురుషులు, 21 మంది మహిళా రైతులు ఉన్నారు. ముఖ్యంగా మూడు జిల్లాలో అత్యధికంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మెదక్‌లో 96 మంది, ఆదిలాబాద్‌లో 66, సిద్దిపేట జిల్లాలో 48 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉరితాళ్లు పేనుతున్న నేతన్నలు
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. వారికి ఉపాధికి మరింత తోడ్పాటునందించి భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 2023, డిసెంబర్ 9 నుంచి 2025, ఆగస్టు 28 వరకు 45 మంది నేతన్నలు ఆతహత్య చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘చేయూత’ పథకం కింద ప్రతి నెలా రూ.4000 పెన్షన్‌ను చేనేత కార్మికులకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలు, కార్మికుల అభివృద్ధి కోసం కేవలం రూ.371 కోట్లు కేటాయించి మొండిచెయ్యి చూపింది. కేసీఆర్ హయాంలో రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయించి చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి బయట పడేలా చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ సర్కారు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదు. నూలు సబ్సిడీ స్థానంలో చేనేత కార్మిక కుటుంబాలకు ఏటా రూ.24 వేల చొప్పున ఇస్తామని ప్రకటించి అటకెక్కించింది. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక పథకాలు అమలు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నేతన్న ఆత్మహత్య అనే మాట కూడా వినిపించకుండా వారిని ఆదుకోవాలనే ఉక్కు సంకల్పంతో వారికి బతుకమ్మ చీరలు నేసే ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో అనేక మంది నేతన్నలు నేడు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్ర్తాల్లో 50 శాతం ప్రభుత్వం కొనుగోలు చేసి వారి ఉపాధికి భరోసా కల్పించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నేతన్నలకు భరోసా కల్పించి వారిలో ఆత్మస్థయిర్యం పెంచాలని నేత కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారీగా పెరిగిన క్రైమ్ రేట్ ; తీవ్రమైన నేరాల్లో 22.53 శాతం పెరుగుదల
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : 20 నెలల్లోనే రాష్ట్రంలో క్రైమ్‌రేట్ భారీగా పెరిగింది. రాష్ర్టానికి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, తక్షణం ఆదేశాలు ఇవ్వకపోవడం, శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంమంత్రి లేకపోవడంతో నేరాలు దారుణంగా పెరుగుతున్నాయి. నిత్యం హత్యలు, రేప్‌లు, కిడ్నాప్‌లు, దోపిడీ కేసులు నమోదవుతున్నాయి. రోజూ 9 రేప్ కేసులు రికార్డవుతున్నాయి. మూడు హత్యలు, ఐదు కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. తీవ్రమైన నేరాల శాతం నిరుడుకంటే ఈ ఏడాది అత్యధికంగా 22.53 శాతం పెరిగింది. దొంగతనాలు, దారిదోపిడీలు, దోపిడీలు, రాత్రివేళ చోరీలు ప్రతిరోజూ 78 చొప్పున నమోదయ్యాయి. 100పైగా చీటింగ్ కేసులు రికార్డవుతున్నాయి. అన్ని నేరాలు కలిపి 10 శాతం క్రైమ్ రేట్ నమోదు కాగా త్రీవమైన నేరాలు 22.53 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు దారుణంగా పెరిగాయి. గతంతో పోల్చితే మహిళల హత్యలు 13.15 శాతం అధికమయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363 పెరిగాయి. రేప్ కేసులు 2945 (28.94%) నమోదయ్యాయి. నిరుడు ఎస్సీ, ఎస్టీలపై 1,877 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 11 నెలల్లోనే 2,257 (20.24 శాతం) కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో 18 ఏండ్ల లోపు వారు 1251 మంది ఉండగా 18 ఏండ్లు పైబడిన వారు 274 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో క్రైమ్ రేట్ 9.87శాతంగా నమోదైంది. 2023లో నమోదైన మొత్తం కేసుల్లో 39,371 కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది మాత్రం కేవలం 28,477 కేసుల్లో మాత్రమే (-27.67శాతం) శిక్షల రేటు నమోదైంది.
హత్యల వివరాలు
జిల్లాలవారీగా నేతన్నల ఆత్మహత్యలు ఇలా..
మాజీ సర్పంచుల బలవన్మరణం ; ఇప్పటివరకు 8 మంది ఆత్మహత్య
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): 2019-2024 వరకు సర్పంచులుగా పనిచేసిన వారికి రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉన్నది. పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, పారిశుద్ధ్యం, ఇంకుడుగుంతలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, వివిధ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు అమలుచేశారు. వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా నేటికీ రేవంత్‌రెడ్డి సర్కారు క్లియర్ చేయలేదు. అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచులు వడ్డీ చెల్లించలేక అప్పుల భారం అధికమై ఇప్పటివరకు ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కేసీఆర్ సర్కారు సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో కేంద్రం నుంచి, 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు అందాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వివిధ పథకాల కింద నిధులు భారీగా కేటాయించింది. ఎస్ఎఫ్సీ నిధులు, జనరల్ ఫండ్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే ఫండ్స్ వంటి నిధులను విడుదల చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం అందించే గ్రామీణ అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కేవి. కాంగ్రెస్ పాలనలో 20 నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధి పడకేసింది. రూపాయి లేక పారిశుద్ధ్యం లోపించి గ్రామాలు మురుగు కూపాలుగా మారి ప్రజలు రోగాలపాలవుతున్నారు.
09.12.2023 నుంచి 29.08.2025 వరకు ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు
ఆటోడ్రైవర్ల బతుకులు ఆగం ; 20 నెలల పాలనలో 155 మంది ఆత్మహత్య
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.12000 ఆర్థిక సహాయం అందజేస్తాం. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తాం. ప్రతి పట్టణంలో ఆటోనగర్లు ఏర్పాటు చేస్తాం.. పెండింగ్‌లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లు 50 శాతం రాయితీతో పరిష్కరిస్తాం’ ఇవి ఆటోడ్రైవర్లకు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. వీటిలో కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోగా బీఆర్ఎస్ హయాంలో ఆటోడ్రైవర్లకు అమలైన ప్రమాదబీమాను సైతం ఆపేసింది. ఓవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి ఆగం కాగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో వారి బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 155 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రమాద బీమాకు కూడా మంగళం పాడారు. ఉచిత బస్సు పథకం కారణంగా గిరాకీ లేక, పూట గడవడం ఇబ్బందిగా మారి చేసేదేమీ లేక ఆటోడ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి బతుకులు ఆగమైన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆటో యూ నియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
09-12-2023 నుంచి 29-08-2025 వరకు ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్లు : 155
ఉమ్మడి ఖమ్మం -16రక్షకభటులకు భరోసా కరువు ; 20 నెలల్లో 25 మంది పోలీసుల ఆత్మహత్య
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రజలకు భద్రత, భరోసా కల్పించాల్సిన పోలీసులే కాంగ్రెస్ ఏలుబడిలో బలవనర్మణాలకు పాల్పడుతున్నారు. రేవంత్‌రెడ్డి 20 నెలల పాలనలో 25 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో హోంగార్డుల నుంచి కానిసేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎస్ఐల వరకు ఉన్నారు. కేవలం మీడియా ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 25 మంది పోలీసులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీస్‌శాఖ అధికారిక నివేదిక ఇస్తే ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తించాల్సి రావడం, చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారడం వంటి కారణాలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా తమ హక్కుల సాధనం కోసం పోలీస్ కుటుంబాలే రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఏక్ పోలీస్ విధానం అమలు కోసం బెటాలియన్ పోలీసుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. గతంలో 15 రోజులు డ్యూటీ చేస్తే నాలుగు రోజులు సెలవులు ఇచ్చేవారు. 26 రోజులు డ్యూటీచేసిన తర్వాత నాలుగు రోజులు సెలవు తీసుకోవాలని కొత్త నిబంధన పెట్టారు. దీన్ని సవరించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్ విధానం అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ కుటుంబాలు నిలదీశాయి. హోంశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా, కుటుంబసభ్యులు ఆందోళన చేశారని పోలీసులపైనే చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీస్‌శాఖలో ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ సిబ్బందిలో మనోధైర్యం నింపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ముందు పోలీసులకు అనేక హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలుచేయడం లేదు.
ఆత్మహత్య చేసుకున్న పోలీసుల సంఖ్య : 25
గురుకులాల్లో మృత్యుఘోష ; 20 నెలల్లో 107 మంది విద్యార్థుల మృతి
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ రాజ్యంలో విద్యాకుసుమాలు అర్ధంతరంగా రాలిపోతున్నాయి. విషాహారంతో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. కాంగ్రెస్ 20 నెలల పాలనలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 107 మంది గురుకులాల విద్యార్థులు మృతిచెందడం విషాదకరం. వీరిలో బాలికలు 63 మంది ఉండగా బాలురు 44 మంది ఉన్నారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే సర్కారు పేరుకు ఓ ఎంక్వయిరీ కమిటీ వేయడం, కంటితుడుపుగా వార్డెన్నో, లేదా ప్రిన్సిపాల్నో సస్పెండ్ చేసి దులుపుకోవడం పరిపాటిగా మారింది. అంతేతప్ప అసలు వాటికి కారణాలేమిటి? ఎందుకు ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయి? ఎవరు కారకులు? పరిష్కార మార్గాలేమిటి? అన్న అంశాలపై ఇటు ఉన్నతాధికారులు గాని, అటు రేవంత్ సర్కారు గాని దృష్టిపెట్టిన దాఖలాల్లేవు. గురుకులాల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. కొత్త బడివేళలతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల దినచర్య ఉదయం 5 గంటలతో మొదలై, 7 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్, ఆ తర్వాత 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 వరకు 7 పీరియడ్లను ఏకధాటిగా నిర్వహిస్తే ఎలా భరిస్తారని నిలదీస్తున్నారు.
తల కూడా తిప్పుకొనే అవకాశం లేకుండా ఏకంగా 3 గంటలపాటు కూర్చొని పాఠాలు వినాల్సి రావడం, ఏకాగ్రత దెబ్బతినడం, ఒత్తిడి పెరగడం విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమని వైద్యారంగ నిపుణులు చెప్తున్నారు. ఉపాధ్యాయులు సైతం మానసికంగా కుంగిపోతున్నారు. విద్యార్థులపై దృష్టిసారించడం లేదని ఉద్యోగులే బాహాటంగా చెప్తున్నారు. పాఠాలు చెప్పడమే కాకుండా డైనింగ్, వాటర్ డ్యూటీ, శానిటరీ డ్యూటీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్, కూరగాయలను కొలతలతో ఇవ్వడం, రాయడం లాంటి అనేక బోధనేతర విధులతోనే నిత్యం సతమతమవుతున్నారు. వృత్తికి, తాము చేసే పనికి సంబంధమే లేదనే నైరాశ్యంలో కూరుకుపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఇక విద్యార్థులనెలా పర్యవేక్షిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ సైతం గురుకుల విద్యార్థుల బలవన్మరణాలకు ఓ ప్రధాన కారణంగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియను గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహించారు. జిల్లాల వారీగా మెరిట్‌తో కాకుండా, రాష్ట్ర మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు. సుదూర ప్రాంతాల్లో సీట్లు కేటాయించడంతో విద్యార్థులు పూర్తిగా గురుకులాలపై విముఖత చూపడమేకాకుండా మానసిక క్షోభకు గురవుతున్నారు. దూరభారం వల్ల తల్లిదండ్రులు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఫుడ్ పాయిజన్‌తో హడల్ ; ఇప్పటి వరకు మొత్తంగా 1,918 మంది విద్యార్థులు దవాఖానల పాలు
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ తదితర గురుకులాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆహార కలుషిత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ దవాఖానల పాలవుతున్నారు. పలు చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకే గురుకులంలో పదే పదే ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతుండటం సర్కారు వైఫ్యలానికి అద్దంపడుతున్నది. గురుకులాలకు ఆహార పదార్థాలు, కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయాలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేవారు. ఫలితంగా విద్యాసంవత్సరం ఆరంభం నాటికి కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు.
కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. పాత కాంట్రాక్టర్లే ఆ సెక్యూరిటీ డిపాజిట్లను గత మేలో చెల్లింపులు చేశారు. అనధికారికంగా కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా ఆహారపదార్థాల సరఫరాదారులు అరకొరగా, నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నారు. ఫలితంగానే ఎక్కువగా ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. క్యాటరింగ్ సేవలు నిర్వహించిన కాంట్రాక్టర్లకు సైతం ప్రభుత్వం దాదాపు 8 నెలల బిల్లులను విడుదల చేయలేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొర సిబ్బందితో కాలం వెల్లదీస్తున్నారు. సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగి వంటపాత్రలను శుభ్రంగా కడగకపోవడం, వంటను మమ అనిపించడంతో అంతిమంగా ఫుడ్ పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. ఈ ఏడాది ఇప్పటికీ స్వీపింగ్ సిబ్బందిని నియమించలేదు. దీం తో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. నీటి ట్యాంకులను కూడా శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమై ఎక్కువగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
లైంగికదాడుల వివరాలు
ఉమ్మడి జిల్లాలవారీగా మృతుల సంఖ్య
ఉరి పోసుకుంటున్న రైతన్నలు ; 600 రోజుల్లో 713 మంది
బలవన్మరణంకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగు సంక్షోభంలో పడింది. అప్పులపాలై, రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నడు.
ఉరితాళ్లు పేనుకుంటున్న నేతన్నలు ; రాష్ట్రవ్యాప్తంగా45 మంది బలవన్మరణం
బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్లను సర్కారు నిలిపేసింది. దిక్కుతోచనిస్థితిలో నేతన్నలు చావుచెంతకు చేరారు.
ఆటోడ్రైవర్ల బతుకులు ఆగం ; 20 నెలల్లో155 మంది బలవన్మరణం
ఉచిత బస్సుతో రోడ్డునపడిన ఆటోడ్రైవర్లకు సర్కారు భరోసా ఇవ్వలేదు. దాంతో ఆత్మహత్యలే దిక్కయ్యాయి.
రక్షకభటులకు భరోసా కరువు ; 25 మంది పోలీసుల ఆత్మహత్య
పోలీసులకు భద్రత కరువైంది. హోంగార్డుల నుంచి అధికార్ల దాకా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నరు.
మాజీ సర్పంచుల బలవన్మరణం ; ఇప్పటివరకు8 మంది ఆత్మహత్య
పల్లె కోసం పనిచేసిన వారికి సర్కారు బిల్లులు చెల్లించలేదు. వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టి, చావు ముంగిట నిలిపింది.
గురుకులాల్లో మృత్యుఘోష ; 107 మంది బలవన్మరణం
63 మంది బాలికలు, 44 మంది బాలురుగురుకులాల్లో విషాహారం నిత్యకృత్యమైంది. విద్యార్థుల ఆత్మహత్యలపై నేటికీ సర్కారు నుంచి చర్యల్లేవు.
కుప్పకూలుతున్నరియల్టర్లు ; ఇప్పటివరకు ఇద్దరు ఆత్మహత్య
హైడ్రాతో రియల్టీ రంగం కుప్పకూలింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు బిల్డర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదినుంచీ ఆక్రందన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ దృశ్యం గుర్తుందా? సర్కారు తీరును నిరసిస్తూ ఓ ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందే తన ఆటోకు నిప్పు పెట్టుకున్న ఆగ్రహ ప్రకటనిది
అన్నదాత ఆక్రోశం
కాంగ్రెస్ పాలనలో కొడంగల్ రైతు కన్నీరు పెట్టని రోజుందా?బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం కానుకుర్తి వద్ద చేపట్టిన ఆందోళనలో పురుగుమందు డబ్బాతో ఓ రైతు