హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలను అధిగమించి దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. సీఎం కేసీఆర్ గత నెల 30న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే. దీంతో గత 10 రోజుల్లో 1,28,421 మంది గిరిజనులకు అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాలను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వారంలోగా మిగిలిన 22,725 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 66.64 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నది. ఇందులో రాష్ట్ర ఆవిర్భావం నాటికి 3.08 లక్షల ఎకరాల భూములపై గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 4,06,369 ఎకరాల అటవీ భూములను పంపిణీ చేస్తున్నది. దీంతో గిరిపుత్రులకు మొత్తం 7.14 లక్షల ఎకరాల అటవీ భూములపై యాజమాన్య హక్కులు లభించనున్నాయి. ఇది రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణంలో 10.71 శాతానికి సమానం. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 9.02 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. ఇది ఆ రాష్ట్ర అటవీ విస్తీర్ణంలో 3.85% మాత్రమే, అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 6 శాతం (8.98 లక్షల ఎకరాల) భూములను గిరిజనులకు పంపిణీ చేశారు.
దేశానికి దిక్సూచిగా తెలంగాణ
తెలంగాణ.. పోడు పట్టాల పంపిణీలోనూ దేశానికి దిక్సూచిగా నిలిచింది. గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు అందించటంలో సీఎం కేసీఆర్ తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. రాష్ట్రంలో పోడుపట్టాలు పొందిన వారందరికీ ఈ వానకాలం నుంచే రైతుబంధు అమలు చేస్తామని ప్రకటించారు. రిజనులు అధికంగా ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ర్టాలు తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకునేలా చేశారు. గిరిజనులు సీఎం కేసీఆర్‌ను మరువరు.
– సత్యవతి రాథోడ్,రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి