Telangana | సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ సమైక్య ప్రభుత్వాలు అల్లిన విష వలయాన్ని రాష్ట్రమైనంక తెలంగాణ తొలగించుకున్నది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో బీడు భూములు మాగాణమయ్యాయి. అటు కృష్ణా, ఇటు గోదావరి జలాలను మునుపటికంటే ఎక్కువ వాడుకోవడం కొందరికి కంటగింపుగా మారింది. సమయం కోసం వేచిచూశారు. వాళ్లు ఆశించింది రెండేండ్ల కిందట రానే వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రాజెక్టుల చుట్టూ మళ్లీ విషవలయం అలుముకుంటున్నది. నిన్న కాళేశ్వరం!
నేడు పాలమూరు-రంగారెడ్డి! లక్ష్యం ఒక్కటే.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం! వ్యూహం ఒక్కటే.. నీటి సోర్స్‌ను మార్చడంపై అవినీతి ముద్ర వేయడం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, విచారణల పేరిట వాటిని ఎండబెట్టి, ప్రాణహిత జలాలు ఏపీకి పారేలా చేశారు. ఇప్పుడు పాలమూరు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని కృష్ణా నీటిని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతిమంగా రేవంత్ సర్కార్ అడుగులుఆంధ్రాకు ప్రయోజనాలను పారించడమే!(గుండాల కృష్ణ-మ్యాకం రవికుమార్)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కథ అంటే.. రాసుకుంటే రామాయణమంత, చెప్పుకుంటే భాగవతమంత. ఇది ఊరికే అనలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి కృష్ణా నదిపై ప్రాజెక్టులంటే.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద అరకొర సరఫరా, శ్రీశైలం ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ఒక్కటి మాత్రమే. దాని సామర్థ్యం మూడు టీఎంసీల్లోపే. ఏండ్లు గడిచినా చుక్క నీరు ఎత్తలేదు. శ్రీశైలం సొరంగం ముందుకుపోదు, వెనక్కి రాదు. ఇక జూరాల.. బచావత్ ట్రిబ్యునల్ మానవతా దృక్పథంతో 12 టీఎంసీలు కేటాయిస్తే కర్ణాటకకు ముంపు డబ్బులు ఇవ్వకుండా, నీటినిల్వ చేయకుండా జాప్యంచేశారు. చివరకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో ముంపు డబ్బులు చెల్లించినా, దాని నిల్వ సామర్థ్యం కాగితాలపై 9 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కేవలం ఆరు టీఎంసీలు. అయినా ఉమ్మడి పాలకులు ఆ చిన్న బరాజ్ ఆధారంగా భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎడమకాలువ ఇలా 5.90 లక్షల ఎకరాల ఆయకట్టును మెడకు కట్టారు. గోదావరి విషయానికొస్తే.. వరప్రదాయినిగా అభివర్ణించే శ్రీరాంసాగర్ ఆయకట్టు లక్ష్యం 14 లక్షల ఎకరాలు. కానీ ఏనాడూ నాలుగైదు లక్షలు పారింది లేదు.
నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే కాకతీయ కాలువ శిథిలమై రెండు, మూడువేల క్యూసెక్కులు కూడా పారని దుస్థితికి చేరింది. సింగూరు కడితే హైదరాబాద్ తాగునీటికి మళ్లించారు. ఎల్లంపల్లి ముందుకు పోదు, మిడ్‌మానేరు ఇంచు కదలలేదు. ప్రాణహిత-చేవెళ్ల అంటూ నీరులేని చోట బరాజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించి పదేండ్లయినా అంతర్రాష్ట్ర చిక్కుముడులు విప్పనేలేదు. వన్యప్రాణి అభయారణ్యమైనందున కనీసం అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. దిగువన ఇందిరా, రాజీవ్‌సాగర్ ఉంటే హెడ్ రెగ్యులేటర్ మాత్రం ఏపీలో ఉన్నది. ఒక్క ప్రాజెక్టు పూర్తికాదు గానీ తెలంగాణ ఖాతాలో రూ.వేలాది కోట్లు ఖర్చు మాత్రం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, టెండర్లతో తెలంగాణ కాంగ్రెస్ నేతల దాహార్తి తీరిందేగానీ రైతులు బాగుపడింది లేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టు అంటే కనీసం నాలుగైదు దశాబ్దాలు అనేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శాపం.
కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో రీడిజైనింగ్ పూర్తిచేసి ఒకవైపు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులే కాదు! రైతులు ఆశలు వదులుకున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌గా మార్చడంతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించారు. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా సాగునీటి రంగానికి ఏటా రూ.26 వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేసి ఏటేటా లక్షల ఎకరాల్లో ఆయకట్టును పెంచారు. ఎలాంటి చిక్కుముడులు, అంతర్రాష్ట్ర సవాళ్లు లేకుండా ప్రాజెక్టులను పూర్తిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జలద్రోహం జరిగినందునే తెలంగాణ తెచ్చుకున్నామన్న ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణను దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలిచిందంటున్నారంటే పదేండ్ల కేసీఆర్ పాలన పుణ్యమే అనేది అక్షర సత్యం.
తెలంగాణ జీవనాడులే లక్ష్యంగా దాడి
ప్రస్తుతం తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉండొచ్చు. కానీ వాటిల్లో అత్యంత కీలకమైనవి గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏకంగా 13 జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మరో 16 లక్షల ఎకరాల శ్రీరాంసాగర్, దేవాదుల ఆయకట్టును స్థిరీకరిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక కృష్ణాపై పాలమూరు జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా ఏకంగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు కల్వకుర్తి కింద మరో 2.50 లక్షల ఎకరాలకు ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టే జీవనాధారం. దీంతోపాటు సాగునీటికి నోచని రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు జీవం పోస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాలమూరు తలరాత శాశ్వతంగా బంగారం కావడంతోపాటు రంగారెడ్డి గ్రామీణ ప్రాంతం సైతం ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో చేరుతుంది. కీలకమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా తొలి ప్రభుత్వ హయాంలో ఆదిత్యనాథ్ దాస్‌తో కేంద్రానికి అత్యధిక ఫిర్యాదులు చేసింది కూడా ఈ రెండు ప్రాజెక్టులపై కావడం గమనార్హం. ఇందుకు కొనసాగింపుగా దురదృష్టవశాత్తు రెండేండ్ల క్రితం ఏర్పడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరిగ్గా ఈ రెండు ప్రాజెక్టులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగించే పరిణామం. ముఖ్యంగా ఈ రెండు ప్రాజెక్టులపై జరుగుతున్న దాడి తీరు కూడా ఒకే విధంగా ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు.. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగడాన్ని ఆసరా చేసుకొని రెండేండ్లుగా విచారణలు, కమిషన్ల పేరిట పునరుద్ధరించడం లేదు. ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా దిగువకు ఆంధ్రప్రదేశ్‌కు పారిస్తున్నారు. గత రెండేండ్లుగా ప్రధాన గోదావరిలో పుష్కలమైన ఇన్‌ఫ్లో ఉండటంతో సమస్య భారీగా లేదు. అయినా యాసంగిలో ఆయకట్టు విస్తీర్ణాన్ని తగ్గించి క్రాప్‌హాలిడేతో ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ప్రాజెక్టు విషయంలో సోర్స్‌ను తుమ్మిడిహట్టినుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందనేది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వాదన. మేడిగడ్డ వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత ఉన్నదని చెప్తున్నది. కానీ రెండేండ్ల నుంచి దానిని నిరూపించడమే లేదు. పైగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్తూ, కేవలం 80 టీఎంసీలనే లిఫ్ట్ చేస్తానని అంటున్నది. అయినా 150 మీటర్ల తుమ్మిడిహట్టి బరాజ్‌పై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. ఒక్క ప్రాజెక్టును నాలుగున్నర దశాబ్దాల్లో పూర్తిచేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. అలాంటిది గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శిస్తున్నది. ఇదే ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించి, మరో 45 టీఎంసీలు ట్రిబ్యునల్ చిక్కుల్లో ఉన్నాయని ఏపీ, కేంద్రం కంటే ముందుగా తానే రాజీ పడుతున్నది. అదేమంటే ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కావాలంటే ఈ తగ్గింపు అనివార్యమని చెప్తున్నది. రెండేండ్లుగా ప్రాజెక్టుపై పల్లెత్తు మాట మాట్లాడని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ప్రాజెక్టు పనులను పునరుద్ధరించనేలేదు. బీఆర్ఎస్ దీనిని ఎత్తిచూపడంతో ఇప్పుడు కాళేశ్వరం మాదిరిగానే ఇక్కడా జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ మార్చడం వెనుక అవినీతి జరిగిందంటూ కొత్త రాగం అందుకున్నది. దీనిపైనా విచారణకు ఆదేశించేందుకు మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించినట్టు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారు. అంటే విచారణ జరుగుతున్నందున నివేదికలు వచ్చేవరకు పనులు పునరుద్ధరించలేమంటూ కారణాన్ని చూపబోతున్నారన్నమాట.
జూరాల వద్ద పాలమూరు ప్రాజెక్టే ఒక కుట్ర

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అందునా ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. కానీ అది ఓ భారీ కుట్ర అనేది మాత్రం ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సమీపించిన తరుణంలో దింపుడు కల్లం ఆశలో భాగంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి వేసిన గాలమే ఈ ప్రాజెక్టు. అందుకే 8, ఆగస్టు 2013న ప్రాజెక్టు సర్వే కోసం నిధులు ఇస్తూ జీవో 72 జారీ చేశారు. అందులో జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇదేమంటే శ్రీశైలం జలాశయానికి రాకముందే కృష్ణాజలాల్ని ఒడిసిపట్టచ్చని సీఎం రేవంత్‌రెడ్డి సూత్రీకరిస్తున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
శ్రీశైలం జలాశయం మీద ఆంధ్రప్రదేశ్ గుత్తాధిపత్యానికి, ప్రధానంగా పోతిరెడ్డిపాడుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సమైక్య పాలకులు పాలమూరు ప్రాజెక్టును జూరాల వైపు మళ్లించారు.
అసలు జూరాల పూర్తి సామర్థ్యమే 9 టీఎంసీలు. లైవ్ స్టోరేజీ ఆరు టీఎంసీలు మాత్రమే. ఈ క్రమంలో జూరాలకు ఎగువ నుంచి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే రోజుకు రెండు టీఎంసీలు మళ్లించుకోవచ్చు. అంటే ఎన్ని రిజర్వాయర్లు నిర్మించుకున్నా ఒక పంటకు నీళ్లు ఇవ్వొచ్చు. యాసంగి పరిస్థితి అగమ్యగోచరం. ఎందుకంటే ఎగువ నుంచి వరద నిలిచిపోగానే జూరాలలో ఉండేది ఆరు టీఎంసీలు మాత్రమే. అవి మూడు రోజుల్లో ఖాళీ చేయొచ్చు. పైగా జూరాల మీద ఆధారపడి మరో 5.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
మిషన్ భగీరథ మంచినీటి అవసరాలకే ఒకటిన్నర టీఎంసీలు కావాలి. ఎండాకాలం వచ్చిందంటే ఒక టీఎంసీ మంచినీటి కోసం నారాయణపూర్ నుంచి నీళ్లు వదలమని తరచూ కర్ణాటక ప్రభుత్వాన్ని వేడుకునే పరిస్థితుల్లో జూరాల మీద ఆధారపడి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మనుగడ సాధిస్తుందా?
కుట్రలో తుంగభద్ర కూడా మరో కారణం
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి పెట్టడంలో మరికొన్ని కారణాలూ ఉన్నాయి. అందులో కీలకమైనది తుంగభద్ర. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయానికి ఏటా 800 టీఎంసీల ఇన్‌ఫ్లోలు వస్తే జూరాల నుంచి 350 టీఎంసీలే వస్తాయి. మిగిలిన 450-500 టీఎంసీల వరకు వరద తుంగభద్ర నుంచి వస్తుంది. అంటే పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి పెట్టడం వల్ల ఈ తుంగభద్ర నీటి లభ్యత అనేది ఉండదు. శ్రీశైలమైతే జూరాల నుంచి ప్రధాన కృష్ణాలో ఇన్‌ఫ్లోలు లేకున్నా తుంగభద్ర నీటితో పాలమూరుకు నీళ్లొస్తాయి. పైగా జూరాల ఎగువన ఆల్మట్టి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ తుంగభద్రపై ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టుకునేందుకు బ్రిజేష్ అనుమతి ఇవ్వలేదు. కర్ణాటక ఎంత ఒత్తిడి తెచ్చినా, అప్పర్ తుంగ, అప్పర్ భద్రపై రెండు టీఎంసీల చొప్పున మాత్రమే కేటాయింపులు చేసింది. వీటన్నింటికీ మించి జూరాల కంటే తుంగభద్ర వరద రోజులు ఎక్కువ.
అందుకే కేసీఆర్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన సమయంలో ఇలాంటి సమీక్షలు ఎన్నో జరిగాయి. రిటైర్డ్ ఇంజినీర్లు, సర్వీసు ఇంజినీర్లతో పాటు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అప్పటి సీఎం కేసీఆర్ జూరాల నుంచి శ్రీశైలం వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. కల్వకుర్తి పథకానికి ఐదు మోటర్లు ఉన్నా కాలువల సామర్థ్యం లేకపోగా ఆయకట్టు ఐదు లక్షలకు పెరిగింది. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ప్రాజెక్టును డిజైన్ చేయడం ద్వారా రెండు చోట్ల సూయిజ్లను ఏర్పాటు చేసి కల్వకుర్తి పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించవచ్చని శ్రీశైలంను ఎంపిక చేశారు. పైగా జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్టును చేపడితే నెట్టెంపాడు కింద ఉన్న ఆయకట్టు భూములను సేకరించాల్సి ఉంటుంది. ఒక ప్రాజెక్టు కోసం ఇంకో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు భూముల్ని సేకరించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు కూడా రేకెత్తాయి. వీటన్నింటికీ మించి జూరాల నుంచి ప్రాజెక్టును చేపట్టడంలో భౌగోళికంగానూ అనేక సవాళ్లు ఉన్నాయని సర్వేలోనే తేలింది.