హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ఈవీ(ఎలక్ట్రికల్ వెహికిల్) పాలసీ తీసుకొచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలను విస్తృతంగా వాడేలా ఈ పాలసీ ఉన్నట్టు తెలిపారు. ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15 ఏండ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్‌కు తరలించాలని సూచించారు. హైబ్రిడ్ వాహనాలకూ పన్ను రాయితీపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
వరి కొయ్యలను కాల్చొద్దు ;రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వరి, పత్తి కొయ్యలను కాల్చొద్దని, దీంతో అనేక అనర్థాలు తలెత్తుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. వరి కొయ్యలను కాల్చడంతో భూమిలోని సేంద్రియ, కర్బనశాతం తగ్గిపోయి నేల నిస్సారంగా మారుతుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమంలో భాగంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు.