Telangana Decade Celebrations | హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాయి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉర్దూ, తెలుగు భాషల్లో రచన, పద్యం, కవిత్వంలో కవి సమ్మేళనాలను నిర్వహించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకలు ఆద్యంతం అలరించాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కవి సమ్మేళనంలో దాదాపు 150 మంది అవార్డు పొందిన కవులు పాల్గొనడం విశేషం.
కవి సమ్మేళనం సందర్భంగా ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా రూ.1,00,116, రెండో బహుమతిగా రూ.75,116, మూడో బహుమతిగా రూ.60,116, చతుర్థ బహుమతిగా రూ.50,116, పంచమ బహుమతిగా రూ.30,116 చొప్పున అందజేసి కవులను, సాహితీవేత్తలను సత్కరించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులు, సాహితీవేత్తలను గుర్తించి సతరించారు. వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్, సూర్యాపేటలో జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి సాహిత్య సంబురాల్లో పాల్గొని కవులను సన్మానించారు.
కవులు, రచయితలకు సముచిత స్థానం: శ్రీనివాస్‌గౌడ్
సీఎం కేసీఆర్ పాలనలో కులాలు, మతాలకు అతీతంగా కవులను సన్మానించుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ స్వార్థంతో ప్రజలను కులాలు, మతాలవారీగా విడదీశారని, నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వం అందరూ కలిసి మెలిసి జీవించేలా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం-బహుభాషా కవి సమ్మేళనం’లో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్నీ భాషల కవులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా సాహితీ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. మహాత్మాగాంధీ ఇచ్చిన ‘గంగా జమునా తెహజీబ్’ నినాదంతోనే ఐక్యమత్యంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్నీ వర్గాలకు మేలు జరిగేల పథకాలు సృష్టించారని కొనియాడారు. ఉర్దూ కవులను గుర్తించి సన్మానించుకోవడం గొప్ప విషయమని అన్నారు. కలిసిమెలిసి జీవనం సాగించిన గొప్ప చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నదని చెప్పారు. ఆనాడు మూసీనది పొంగిపొర్లితే నిజాం వంశస్థులు శాంతి పూజలు చేశారని వివరించారు. తెలుగు, ఉర్దూ కవుల రచనలన్నీ పుస్తక రూపంలో తీసుకొస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క భాషకూ గొప్ప స్థానం కల్పిస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. గత పాలకులు ఏనాడూ కవులను సత్కరించుకోలేదని, ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ఈ రోజు ఉర్దూ సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసి ఆ భాష ఉన్నతికి కృషి చేయడం గొప్ప విషయమని అన్నారు. ఉర్దూ ప్రాభవాన్ని పుంజుకునేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం ప్రముఖ కవులు డాక్టర్ ఎన్ గోపి, సలావుద్దీన్ తదితరులను మంత్రులు సత్కరించారు. ప్రముఖ ఉర్దూ కవి మక్దూం మొయినుద్దీన్ పేరిట పలువురు కవులకు జీవితసాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
25
ఆద్యంతం ఆసక్తిగా..
బహు భాషా కవి సమ్మేళనంలో కవులు తమ రచనలను వినిపిస్తూ ఆకట్టుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సాగిన వారి అక్షరసేద్యం ఎంతో హృద్యంగా సాగింది. తొలుత ప్రముఖ కవి రుక్మాభట్ల కృష్ణమూర్తి తన పద్యాన్ని వినిపించారు.
‘కత్తులు బట్టలేదుచురకత్తులు చేత ధరించలేదు తామెత్తని సింహమై భరతమేరిని దిక్కులు పిక్కటిల్లగా సత్తువ జూపి ఉద్యమ దశన్ దిశ మార్చిన జోదు, సాహసోదాత్తుడు చంద్రశేఖరుడు’ అంటూ సాగిన రుక్మాభట్ల కృష్ణమూర్తి పద్యవచనం ఆద్యంతం మైమరిపించింది. అనంతరం సీఎం కేసీఆర్‌కు చదువు చెప్పిన గురువు వేలేటి మృత్యుంజయశర్మ తన పద్యాన్ని వినిపించారు.‘మా తెలంగాణ రాష్ట్రమున మాన్యుడు, పూజ్యుడు చంద్రశేఖరుండే తగు నాయకుండనుచు ఎల్ల జనావళి మెచ్చుచుండగన్ మా తల రాత మార్చు మహిమాన్వితుడొక్కడు ఎల్లవేళ ఈ భూతల మేలగా దగిన పుణ్య చరిత్రుడు రాజుగా దగున్’ అంటూ మృత్యుంజయశర్మ పద్యం వినిపించడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికపై సీఎం కేసీఆర్‌కు ఉన్న జ్ఞానం ‘న భూతో నభవిష్యత్తు..’ అని కొనియడారు. అటువంటి జ్ఞానం ఎవ్వరికీ లేదని ప్రశంసించారు. కేసీఆర్ ఒక పుణ్యక్షేత్రుడు. అటువంటి వాడే రాజుగా ఉండాలని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతీ పల్లె జలాశయంగా మారిందని కొనియాడారు. అనంతరం ప్రముఖ కవి డాక్టర్ ఎన్ గోపి తన రచనను వినిపించారు.
‘ఏమాట కామాటే చెప్పుకోవాలి
ఇది తెలంగాణలో జల దశాబ్దం
ఇది విద్యుత్తు వెలుగుల నవనవాబ్దం
ఇది ప్రగతిదారుల గతిశీల శబ్దం
ఇది నిరంతర ఆచరణల నిశ్శబ్దం
అమ్మా..! తెలంగాణ జననీ
మన్ననలందుకుంటున్న భారతావనీ
వందనం.. అభివందనం నీకు.”
అంటూ గోపి వినిపించిన కవిత్వం అలరింపజేసింది.అనంతరం ప్రొఫెసర్ రామా చంద్రమౌళి తన రచనను వినిపిస్తూ..
‘చిన్నవే.. మిణుకు మిణుకు నక్షత్రాలే.. అయినా కల్యాణలక్ష్ములు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్కిట్లు, కులవృత్తుల లక్షలు, రైతుబంధులు, చదువుల అక్షరామృతాలు, సాంకేతిక శిఖరోన్నతులు ఇవన్నీ కొత్త తరాలను సృష్టిస్తున్న సరికొత్త చరిత్రలు’అంటూ వినిపించారు. డాక్టర్ సంధ్య విప్లవ్ తన పద్యం వినిపిస్తూ..
‘భౌగోళిక తెలంగాణ బరిగీసిన భైరవా
భౌగోళిక తెలంగాణ గస్తీ కాస్తున్నావా’
అంటూ కేసీఆర్ పాలన, రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని వర్ణించిన విధానం ఆనాటి తెలంగాణ పోరాట ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇలా ప్రతి ఒక్క కవి తమ రచనను రవీంద్రభారతి వేదికగా వినిపిస్తూ తన్మయత్వం చెందారు.