హైదరాబాద్, జూన్ 12, నమస్తే (తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించడం ద్వారా తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎన్నికల ప్రచార సభలో చేసిన రాజకీయ ప్రసంగమని, దీనిపై కేసు నమోదు అన్యాయమని రేవంత్ తరఫు న్యాయవాది వాదించారు. రాజకీయ ప్రసంగంలో చేసిన ఆరోపణల వల్ల బీజేపీ పరువుకు నష్టం వాటిల్లదని అన్నారు. ఫిర్యాదిదారు కాసం వెంకటేశ్వర్లు కౌంటరు దాఖలు చేయకపోవడంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. అప్పటివరకు కింది కోర్టులోని కేసు విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.