హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీ నిమిత్తం ఈ నెల 6న ఆ శాఖ కార్యదర్శి జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఈ మార్గదర్శకాలను జారీ చేశారంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తీక్ ఇటీవల విచారణ జరిపారు.
గురుకులాల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ నిబంధనల పరిధిలోకి తీసుకొస్తూ 2022 జూలై 7న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బదిలీ మార్గదర్శకాలను జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీంతో ఆ మార్గదర్శకాలపై ఈ నెల 18 వరకు స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.