BC Reservations | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీసీ రిజర్వేషన్లపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విలువడిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 9ని జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య, వీ హన్మంతరావుతో పాటు పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఆయా అన్ని పిటిషన్లను సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. తాజాగా రిజర్వేషన్ల అంశంపై గురువారం సైతం వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కుల గణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. స్వాతంత్య్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని చెప్పారు.
ఈ సర్వేపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. బీసీ జనభా 57.6 శాతం ఉన్నారంటే ఎవరూ కాదనడం లేదని.. 57.6 శాతం జనాభా ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందని.. గ్రామీణ, పట్టణ సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందన్నారు. గడువు లోగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని.. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు.
అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల కోరిక అని.. దాన్ని అసెంబ్లీ ఆమోదించిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగిందని.. సర్వేలో అన్ని కులాల లెక్కలు తేలాయన్నారు. బీసీ సబ్ కేటగిరిల వారీగా వివరాలు సర్వేలో తేలాయన్నారు. సర్వేలో అగ్రవర్ణాల లెక్కలు బయటకు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిందని కోర్టుకు చెప్పారు. కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారని.. అది తప్పని ఏజీ చెప్పారు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పత్రులను ఏజీ ధర్మాసనం ఎదుట ఉంచారు. నోటిఫికేషన్ వచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదని.. నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అయితే, రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని పిటిషనర్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లు, ప్రభుత్వానికి నాలుగు వారాలు సమయం ఇచ్చింది. మళ్లీ నాలుగు వారాల తర్వాత రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుగనున్నది.