అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను గేటు వద్దే నిలువరించడం ఏంది? సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనల అమలు, క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారాలపై సర్వాధికారం స్పీకర్‌దే. అలాంటప్పుడు పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారు?
-హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టసభల సభ్యులు అసెంబ్లీలోకి వెళ్లకుండా నిరోధించే అధికారం పోలీసులకు లేదనిస్పష్టం చేసింది. అసెంబ్లీ ఆవరణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని, పోలీసులు కానేకాదని తేల్చిచెప్పింది. సోమవారం అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, విచక్షణారహితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ పక్ష ఉప నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఏ అధికారంతో అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించినా, చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. వారిని బలవంతంగా గెంటివేశారని, దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులు కిందపడి గాయపడ్డారని చెప్పారు. మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, ఆమె చీర పట్టుకొని లాగడంతో దుశ్శాసనపర్వం చోటు చేసుకున్నదని, మరో మహిళా ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని మెడ పట్టుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధిం చిన ఫొటోలను పరిశీలించాలని కోరారు. న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్, ఖైరతాబాద్ డీసీపీ, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో, శాసనసభ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యులను శాసనసభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను గేటు వద్దే నిలువరించడం ఏమిటని నిలదీసింది. సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనల అమలు, క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారాలపై సర్వాధికారం స్పీకర్దేనని, అలాంటప్పుడు పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజ్ కల్పించుకొని అసెంబ్లీలోకి వెళ్లే చట్టసభ సభ్యులకు డ్రెస్ కోడ్ ఉన్నదని, ఎమ్మెల్యేలు ధరించిన టీషర్ట్‌లపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతో పోలీసులు అడ్డుకొని ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ వాదనను పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు డ్రెస్‌కోడ్ ఏమీ లేదని, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా టీషర్ట్ ధరించి వెళ్లారని గుర్తుచేశారు.
ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని స్పష్టంచేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకొని, టీషర్ట్‌పై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలున్నాయని చెప్పారు. దీంతో ‘రాహుల్ గాంధీ సైతం ప్లకార్డులతో పార్లమెంట్లో నిరసన తెలిపారు’ అని గండ్ర వాదించారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి కల్పించుచొని.. పురుష శాసనసభ్యులు నల్ల టీషర్ట్ ధరించగా, మహిళా ఎమ్మెల్యేలు చీరలు ధరించి ఉన్నారు కదా? అని ప్రశ్నించారు. ఈ సమయంలోనే ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని చెప్పారు. దీంతో ధర్మాసనం మండిపడింది. ‘అసెంబ్లీ ఆవరణ కూడా స్పీకర్ పరిధిలో ఉంటుంది. సర్వాధికారాలు స్పీకర్వే అయినప్పుడు మీరు (పోలీసులు) ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు అనుమతివ్వడం ఏమిటి?’ అని ప్రశ్నించింది. ‘అసెంబ్లీ వద్ద రక్షణ వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షించే పోలీసులు.. ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లేందుకు అనుమతించాలో లేదో నిర్ణయించే స్థాయికి చేరుతారా? స్పీకర్ అధికారాలను మీరెలా చేతుల్లోకి తీసుకుంటారు?’ అని నిలదీసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు కల్పించుకొని.. పోలీసులు సీనియర్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పట్లే కాకుండా, మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మిరెడ్డి చీర కొంగు లాగి దుర్మార్గంగా వ్యవహరించారని, మరో సీనియర్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మెడ పట్టుకొని దౌర్జన్యంగా, దారుణంగా నెట్టేశారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా దుశ్శాసనపర్వం చోటు చేసుకున్నదని, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకునే దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. వీళ్లందరూ గాయపడ్డారని, వైద్యం చేసుకున్నారని చెప్పారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. ‘ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని చెప్తున్నారు.
మరి సబితా ఇంద్రారెడ్డిని మెడ పట్టుకొని గెంటుతున్న ఫొటోల గురించి ఏం చెప్తారు?’ అని ప్రశ్నించారు. దీనికి.. అవన్నీ ఏఐ ఫొటోలు, వీడియోలు కావొచ్చునని ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజ్ చెప్పడంపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. దీంతో పూర్తి వివరాలు తెలుసుకొని నివేదించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అనంతరం న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా గేట్లు మూసే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, దానిపై చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను డీజీపీ లోతుగా పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది. తప్పిదానికి పాల్పడిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వారిపై తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ నినాదాలతో కూడిన బ్లాక్ టీషర్టులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తుంటే పోలీసులు ఏకపక్షంగా, దౌర్జన్యంగా దాడి చేశారని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, వైద్యులతో చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా కోర్టుకు సమర్పించారు.
టీషర్టులు ధరించడాన్ని సాకుగా చూపి ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని చెప్పారు. టీషర్ట్ ధరించినంత మాత్రాన సభ్యుడిని సభలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎకడిదని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి సహా పలువురు ప్రజాప్రతినిధులు టీషర్టులు ధరించి బహిరంగ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. సభా వ్యవహారాలపై పూర్తి అధికారాలు స్పీకర్‌కే ఉంటాయి కదా? మరి పోలీసులు ఎలా అడ్డుకుంటారు? శాసనసభ ఆవరణలో పోలీసులకు ఆ అధికారం ఎకడిది? స్పీకర్ అధికారాలను ఎలా తమ చేతుల్లోకి తీసుకుంటారు? చట్టసభ సభ్యులనే అసెంబ్లీలోకి వెళ్లనీయరా? సభా వ్యవహారాల్లో పోలీసుల జోక్యానికి అధికారం ఏమున్నది? ప్రతిపక్ష సభ్యులు అంటే ప్రజావాణి కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ న్యాయవాది మహేశ్‌రాజ్ ప్రతివాదన చేస్తూ, శాసనసభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ 316లోని క్లాజ్‌ల ప్రకారం సభలో సభ్యులు ఎలాంటి బ్యాడ్జీలు ధరించడం లేదా ప్రదర్శించడం చేయరాదని తెలిపారు. స్పీకర్ అనుమతి లేకుండా జెండాలు, చిహ్నాలు, ఎంబ్లమ్స్ లేదా ఇతర ప్రదర్శన వస్తువులను సభలో చూపించరాదని పేరొన్నారు. బ్లాక్ టీషర్టులపై నినాదాలు ముద్రించి ఉన్నాయని, ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపు వెళ్తున్నందునే బహుశా పోలీసులు వారిని అడ్డుకొని ఉండవచ్చని చెప్పారు. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సమయం కావాలని కోర్టును కోరారు.