హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాక, విదేశాలకు ఎలా వెళ్తారని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ‘విమానాశ్రయంలో వారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంది?’ అని ప్రశ్నించింది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ, కోర్టుకు రావడానికి ఎందుకు సిగ్గు పడుతున్నారని నిలదీసింది. భూసేకరణ పరిహారానికి సంబంధించి నిరుడు ఏప్రిల్ 24న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మరొకరు హైకోర్టులో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ అంశంలో ఇప్పటికే బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ కోర్టుకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపారు. కోర్టు ధికరణ పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేశామని, వాటికి నంబర్ రాకపోవడంతో కోర్టు వ్యక్తిగత హాజరుకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేశామని, వారెంట్ రీకాల్‌కు, హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశామని వివరించారు. అందుకే అధికారులు కోర్టుకు హాజరుకాలేదని తెలిపారు. చెల్లింపుల్లో జాప్యంపై కూడా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. భూమిని సేకరించిన తర్వాత వారికి పరిహారం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.
50 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా, 12 వాయిదాలు తీసుకొని పరిహారం ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు చివరి అవకాశం కోర్టు ఒకటేనని, భూములు తీసుకున్నాక కనీసం 50 శాతం అయినా చెల్లించకపోతే ఎలా? అని నిలదీశారు. ఒక అధికారికి బదులు మరో అధికారి కౌంటర్ దాఖలు చేయడానికి అధికారం ఎక్కడిదని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సందీప్ కుమార్ సుల్తానియా విదేశాలకు వెళ్లడంతో, వేరే అధికారి కౌంటర్ దాఖలు చేయాలని తాను సలహా ఇచ్చానని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను తాము ప్రశ్నించడంలేదని, అలాంటి సాహసం కూడా చేయబోమని చెప్పారు. క్షమాపణ కోరుతూ ఇద్దరు అధికారులు అఫిడవిట్లు దాఖలు చేయడంతో కోర్టు ధికరణ పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.