సిటీబ్యూరో , సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాక్షస రాజ్యంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయింది.. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రౌడీయిజానికి పాల్పడింది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ శాసనసభ్యులపై అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేరుగా దౌర్జన్యానికి దిగింది. ఈ నిరంకుశ వైఖరిపై సోమవారం గ్రేటర్‌వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దమనకాండను ఖండిస్తూ.. చేసిన రణ నినాదాలతో చారిత్రాత్మక గన్ పారు అమరవీరుల స్తూపం, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. సీఎం దిష్టిబొమ్మల దహనాలతో నగరం అట్టుడికింది.
‘కాంగ్రెస్ రౌడీ రాజ్యం పోవాలి.. కాంగ్రెస్ అరాచకం నశించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా నాయకులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా పోలీసులు రౌడీల్లా వ్యవహరించి అవమానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పోలీసుల దాడిలో గాయపడిన ఎమ్మెల్యేలను చికిత్సకు నిమ్స్‌కి వెళ్లేందుకు సైతం అడ్డుకున్న తీరు దారుణమంటూ.. అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్త్తే ఊరుకునేది లేదని, గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను ఖండిస్తూ.. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. గాజులరామారం,చింతల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనపై అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
-దుండిగల్, సెప్టెంబర్ 7

సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొకేందుకు పోలీసు బలగాలను ప్రయోగిస్తోందని నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రభుత్వం చేసిన కుట్రను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. కర్మన్‌ఘాట్ చౌరస్తాలో బీఆర్ఎస్ పెద్ద శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.
కంటోన్మెంట్లో నియోజకవర్గ ముఖ్యనాయకులు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్, నివేదిక సాయన్న, బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, ఇతర నాయకులు నల్లకండువాలు ధరించి బోర్డు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కుత్భుల్లాపూర్ గండిమైసమ్మ చౌరస్తాలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజులరామారం, సికింద్రాబాద్, ఉప్పల్ చౌరస్తాలో స్థానిక నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్‌లో అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హకును కాలరాస్తూ, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రేవంత్‌రెడ్డి అణచివేత చర్యలకు తగిన గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
