హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటనలు నీటి మూటలే అయ్యాయని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇక బెనిఫిట్‌షోలు ఉండవని చెప్పిన కొద్దికోజులకే సర్కార్ మాటతప్పిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. గేమ్ చేంజర్ సినిమా కోసం టంగ్ చేంజ్ చేశారు’ అని ఎద్దేవాచేశారు. ‘అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోకు అనుమతివ్వడం సభను అవమానించటమే’ అని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హకుల ఉల్లంఘన కింద నోటీసులిస్తామని ప్రకటించారు. ‘మాట తప్పం.. మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతిచ్చారు? ఎవరికి లాభం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు?’ అని ప్రశ్నించారు. గతంలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఓ మహిళ మృతి చనిపోయిందని, మరో పసివాడు ఇంకా దవాఖానలో చికిత్స పొందుతున్నాడని గుర్తుచేశారు.
ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది, సీఎం రేవంత్‌రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. శుక్రవారం మాదాపూర్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో కల్ప్రా వీఎఫ్ఎక్స్ ప్రారంభోత్సవానికి హరీశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రపరిశ్రమ అభ్యున్నతికి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ టెక్నాలజీతో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. కల్ప్రా వీఎఫ్ఎక్స్ సీఈవో మల్లీశ్వర్ సిద్దిపేటలో ఐటీ కంపెనీ పెట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిందని అభినందించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చిత్రపరిశ్రమను ప్రోత్సహించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం కక్ష సాధింపుతో చిత్రపరిశ్రమను దిగజార్చుతున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తనకు నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరోలా అనుచిత నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని, రూల్స్ అంటే అందరికీ ఒకేలా ఉండాలని, లక్షల మందికి ఉపాధి కల్పించే చిత్రపరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు.