హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది. రెండు నెలలుగా వారి సంరక్షణలోనే చిన్నారి ఉన్నదని, వారు ప్రేమగానే చూసుకున్నారని వ్యాఖ్యానించింది. అవసరమైతే అధికారులు శిశువును ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులు ఇతర కేసులకు వర్తించవని పేర్కొం టూ.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖ లు చేయాలని ఆదేశించింది. ఒకరోజు విచారణతో దీనిని తేల్చలేమని, సుదీర్ఘ విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. సరోగసీ పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏర్పాటుచేసిన డాక్టర్ నమ్రత.. ఒకొకరి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. 80 మంది శిశువులను అక్రమ రవాణా చేసినట్టు గుర్తించిన అధికారులు వివరాలు సేకరించారు.
ఆ చిన్నారులను శిశువిహార్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తమ బిడ్డ ఫియాని అప్పగించాలని హైదరాబాద్ పుప్పాలగూడకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి జీ సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ దంపతులు డాక్టర్ నమ్రత బాధితులనేని వివరించారు. పిటిషనర్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నందున డెలివరీకి సరోగసీ విధానాన్ని ఎంచుకున్నారని స్పష్టంచేశారు.
దంపతులిద్దరికీ బిడ్డపై ప్రేమ ఉన్నదని, జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారు. అనారోగ్యానికి గురికాగా రక్త పరీక్షలు నిర్వహించగా, బిడ్డది తమ డీఎన్ఏ కాదని తెలిసిందని వెల్లడించారు. అయినా వారు సొంత బిడ్డలానే చూసుకుంటున్నారని తెలిపారు. బిడ్డను శిశువిహార్‌లో ఉంచినా.. దంపతులు క్రమం తప్పకుండా అకడికి వెళ్లి అవసరాలు తీరుస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బిడ్డను శాశ్వతంగా వారి సంరక్షణకు అప్పగించాలని కోరారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు సరోగసీ చట్టం-2021 నిబంధనలకు లోబడి ఉంటుందని చెప్పారు. పిటిషనర్ ఆ నిబంధనలను ఉల్లంఘించలేరని, సొంత తల్లిదండ్రులు కానందున బిడ్డను అప్పగించడం సాధ్యంకాదని పేర్కొన్నారు. సరోగసీ చట్టంలో సెక్షన్-4 వివరాలను న్యాయమూర్తికి సమర్పించారు. శిశు సంక్షేమ కమిటీ బిడ్డ సంరక్షణ చూస్తున్నదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దంపతులు నమ్రత బాధితులే అని తెలుస్తున్నదని అభిప్రాయపడ్డారు. 2 నెలలు ప్రేమగా చూసిన దంపతులకు చిన్నారిని అప్పగించాలని, అధికారులూ చూడొచ్చని పేరొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేశారు. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, శిశు సంక్షేమ కమిటీ, శిశువిహార్ సూపరింటెండెంట్, గోపాల్పురం ఎస్‌హెచ్‌వో, సిట్‌కు నోటీసులు జారీచేశారు.