హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన పిటిషన్ ఇంకా సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్నందున అకడే తేల్చుకోవాలని స్పష్టంచేసింది. ‘మన శంకరవరప్రసాద్’, ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది డీ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి టికెట్ ధరల పెంపు మెమోను రద్దు చేయడంతోపాటు, ఒకవేళ పెంపు నిర్ణయం తీసుకుంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందు వెల్లడించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ షైన్ స్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలుపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన పిటిషన్లు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల దీనికి సంబంధించిన అభ్యంతరాలుంటే అకడే తేల్చుకోవాలని చెప్పింది. ఇప్పటికే విడుదలైన ‘మనశంకరవరప్రసాద్’ సినిమాపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేనందున అందులో జోక్యం చేసుకోలేమని పేరొంది.