హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులుచెరిగింది. హైడ్రా హద్దులు మీరుతున్నదని, దానికి చట్టం, నియమ నిబంధనలు ఏమీ లేవా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తూ విధ్వంసం సృష్టిస్తున్నదని మండిపడింది. హైడ్రా తానే ప్రభుత్వం అనుకుంటున్నదా… అంటూ నిప్పులు చెరిగింది. ఎన్నిసార్లు హెచ్చరించినా హైడ్రాకు చలనం లేదని.. ఇక ఇదే చివరి వార్నింగ్ అని స్పష్టం చేసిం ది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండ లం సున్నం చెరువు ప్రాంతంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.
అక్కడ అక్రమంగా బోర్లు ఉన్నాయని చెప్పి నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. చట్టవిరుద్ధంగా ఉన్న బోర్ల తొలగింపునకు వెళ్లామ ని హైడ్రా చెప్తున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని తప్పుపట్టిం ది. అక్రమ బోర్ల తొలగింపునకు భారీ యంత్రాలతో ఎందుకు వెళ్లారని నిలదీసిం ది. అయినా, హైదరాబాద్ మహానగరం లో అక్రమ బోర్లు లేనిది ఎక్కడ అని వ్యా ఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతం లో చెరువు విస్తీర్ణంపై సర్వే చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.