Konatham Dileep | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రయాణం చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కేసులున్నాయన్న కారణంతో నిందితుల ప్రయాణాన్ని అడ్డుకోవడం సరికాదని, నేరం రుజువయ్యే దాకా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కేసులున్నాయన్న కారణంతో తనపై పోలీసులు లుకౌట్ సర్యులర్ జారీచేయడం చెల్లదని పేర్కొంటూ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై ఉత్తర్వుల జారీకి సింగిల్ జడ్జి నిరాకరించారు. దీన్ని సవాలు చేస్తూ దిలీప్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. దిలీప్ తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. పిటిషనర్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఓ పుస్తకావిష్కరణలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాల్సి ఉన్నదని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. పిటిషనర్‌పై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన అప్పీ లు విచారణార్హం కాదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ తనపై ఉన్న కేసులను కొట్టేయాలని కోరడం లేదని, ప్రయాణానికి సంబంధించి తన హకులపై కోర్టును ఆశ్రయించారని గుర్తుచేసింది. నేరం రుజువయ్యే దాకా నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హకులను నిరాకరించరాదని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని పేర్కొంటూ.. ప్రయాణం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని, కేసుల పేరుతో ఆ హక్కు ను అడ్డుకోవడానికి వీల్లేదని తెలిపింది.
దిలీప్ అమెరికా వెళ్లేందుకు వీలుగా లుకౌట్ సర్క్యులర్‌ను జూన్ 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. అనంతరం ఆయన ప్రయాణానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. నిర్దేశిత షరతులన్నీ అమలు చేస్తానంటూ అఫిడవిట్ సమర్పించాలని దిలీప్‌ను ఆదేశించింది. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని దిలీప్‌కు స్పష్టం చేస్తూ.. ఆయన అప్పీల్‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.